రాష్ట్రంలో రాక్షస పాలన.. చంద్రబాబుకు జగన్‌ వార్నింగ్‌

ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Update:2024-07-18 13:40 IST

వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యపై స్పందించారు ఆ పార్టీ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేసిన జగన్‌.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు జగన్‌. వైసీపీని అణగదొక్కాలన్న కోణంలో దారుణాలకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఏపీ హత్యలు, అత్యాచారాలు, రాజకీయకక్షతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందన్నారు. వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్టగా అభివర్ణించారు జగన్. నడిరోడ్డుపై జరిగిన హత్య ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీస్ సహా అధికార యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారన్నారు. దీంతో రాష్ట్రంలో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని ఫైర్ అయ్యారు.

ఇప్పటికైనా హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబుకు సూచించారు జగన్‌. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్రప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని అన్ని రకాలుగా అండగా ఉంటామని భ‌రోసా ఇచ్చారు జగన్. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News