ఇండియా కూటమిలోకి వైసీపీ.. జగన్ ఏమన్నారంటే!
మణిపూర్‌లో అల్లర్లపై ధ్వజమెత్తే రాహుల్‌గాంధీ.. ఏపీలో జరుగుతున్న దాడులపై తమకు ఎందుకు మద్దతివ్వడం లేదన్నారు. ఏపీలో వాళ్లకు అనుకూలమైన వారు ఉన్నారు కాబట్టే అడగడం లేదా అని ప్రశ్నించారు.
ఇండియా కూటమిలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న వేళ కాంగ్రెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్. దాదాపు రెండున్నర గంటల పాటు సుదీర్ఘ ప్రెస్‌మీట్‌లో అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్. ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి నేతలు హాజరుకావడంపై కీలక వాఖ్యలు చేశారు.
ఇండియా కూటమిలో చేరికపై మాట్లాడుతూ.. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాకు కాంగ్రెస్ హాజరుకాలేదన్నారు జగన్. తమకు మద్దతిచ్చిన వారితోనే కలిసి పోరాటం చేస్తామన్నారు. ధర్నాకు ఎందుకు హాజరుకాలేదో ఆ పార్టీ నేతలనే అడగాలన్నారు. చంద్రబాబుకు కాంగ్రెస్ నేతలకు ఇంకా సంబంధాలున్నాయన్నారు జగన్. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. మణిపూర్‌లో అల్లర్లపై ధ్వజమెత్తే రాహుల్‌గాంధీ.. ఏపీలో జరుగుతున్న దాడులపై తమకు ఎందుకు మద్దతివ్వడం లేదన్నారు. ఏపీలో వాళ్లకు అనుకూలమైన వారు ఉన్నారు కాబట్టే అడగడం లేదా అని ప్రశ్నించారు. తమతో కలిసి వచ్చే వారితోనే తమ పోరాటం కొనసాగుతుందన్నారు జగన్.
ఏపీలో జరుగుతున్న దాడులు, విధ్వంసకర పాలనపై ఢిల్లీలో జగన్ నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి నేతలు హాజరైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉంది. ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, శివసేన ఉద్ధవ్ టీమ్ నేత సంజయ్ రౌత్, టీఎంసీ ఎంపీలు జగన్ ధర్నాకు హాజరయ్యారు. ఏపీలో దాడుల సంస్కృతిని ముక్తకంఠంతో ఖండిస్తూ జగన్‌కు మద్దతు తెలిపారు. దీంతో జగన్ ఇండియా కూటమి వైపు వెళ్తున్నారంటూ జాతీయ మీడియాతో పాటు స్థానిక రాజకీయవర్గాల్లోనూ చర్చ మొదలైంది. అయితే ఈ ప్రచారంపై తాజాగా జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఇండియా కూటమిలో చేరే ఉద్దేశం లేదని జగన్ మాటల్లో అర్థమైంది.