సునీత, దస్తగిరి లాలూచీ పడ్డారు.. అవినాష్ రెడ్డి హాట్ కామెంట్స్
న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు అవినాష్ రెడ్డి. వైఎస్ వివేకాను సునీత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేశారని, చివరి రోజుల్లో ఆయన్ను దారుణంగా చూశారన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, వివేకానందరెడ్డిని చంపానని ఒప్పుకున్న దస్తగిరి లాలూచీ పడ్డారని.. కుట్రపూరితంగానే సునీత తన పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వివేకా హత్య కేసులో అవినాష్ ని టార్గెట్ చేస్తూ సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇటు నుంచి అంతే ఘాటుగా బదులిచ్చారు అవినాష్. వివేకాను చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్‌మెంట్ ఇచ్చినా.. ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించాలని చూస్తున్నారని అన్నారు అవినాష్ రెడ్డి.
లెటర్ సంగతి ఏంటి..?
దస్తగిరితో సునీత లాలూచీ పడ్డారని, తన ఎజెండా అమలు చేయడానికి దస్తగిరిని ఆమె వాడుకుంటున్నారని విమర్శించారు అవినాష్ రెడ్డి. అందుకే దస్తగిరి బెయిల్‌కు సునీత అడ్డు చెప్పలేదని అన్నారు. సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చిన సునీత.. ఆ తర్వాత లెటర్ గురించి తనకు తెలియదని చెప్పి తప్పించుకున్నారని అన్నారు. వివేకా రాసిన లేఖను సునీత కుటుంబ సభ్యులు ఎందుకు దాచి పెట్టారని, లెటర్ విషయాన్ని పోలీసులకు ఎందుకు చెప్పలేదని సూటిగా ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. వైఎస్ వివేకాను సునీత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేశారని ఆరోపించారు అవినాష్ రెడ్డి. చివరి రోజుల్లో ఆయన్ను దారుణంగా చూశారన్నారు.
గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేకౌట్స్ రెండూ ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు అవినాష్ రెడ్డి. గూగుల్ టేకౌట్ శాస్త్రియతను గూగుల్ సంస్థ కూడా నిర్ధారించలేదన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు. ఎర్ర గంగిరెడ్డికి నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేశారని, వాళ్లుఫోన్ చేస్తేనే ఎర్ర గంగిరెడ్డి వచ్చారని అన్నారు. శివప్రకాష్ రెడ్డి సునీతకు స్వయంగా మేనమామ అని వివరించారు. వాచ్‌మెన్ రంగన్న ప్రత్యక్ష సాక్షి అని, ఆయన నలుగురి పేర్లు చెప్పినా వారిని వెంటనే అరెస్ట్ చేయలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే సునీత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన ప్రశ్నలకు ఆమె బదులు చెప్పాలన్నారు అవినాష్ రెడ్డి.