లోన్‌ యాప్‌ వేధింపులతో ఆగిన మరో ఊపిరి

లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దంపతులు కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే పల్నాడు జిల్లాలో యువకుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.

Advertisement
Update:2022-09-09 19:28 IST

లోన్‌ యాప్‌ నిర్వహకుల వేధింపులు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దంపతులు కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే పల్నాడు జిల్లాలో యువకుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. దాచేపల్లి నగర పంచాయతీలోని నారాయణపురానికి చెందిన శివరాత్రి వెంకటశివ(19) గురువారం రాత్రి ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిడుగురాళ్లలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వెంకటశివ లోన్‌ యాప్‌ ద్వారా రూ.8 వేలు రుణం తీసుకున్నాడు. కిస్తీల రూపంలో ఇప్పటివరకు రూ.20 వేలకు పైగా చెల్లించాడు. మరో రూ.16 వేలు చెల్లించాలని లోన్‌యాప్‌ నిర్వహకులు వేధించారు. చివరికి అశ్లీల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అతడి మిత్రులకు వాట్సప్‌ ద్వారా పంపించారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన వెంకటశివ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉక్కుపాదం మోపనున్న రాష్ట్ర ప్రభుత్వం

ప్రజల ప్రాణాలు తీస్తున్న లోన్‌ యాప్‌ల మోసాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. రిజర్వ్‌ బ్యాంకు గుర్తింపులేని ఈ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. లోన్ యాప్‌ల ఆగడాలను అరికట్టాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఒకవైపు కేసులు నమోదు చేస్తూనే మరోవైపు కేంద్ర ఐటీ శాఖకు చెందిన ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమెర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ( సీఈఆర్టీ)తో కలసి ఈ యాప్‌లను నిషేధించే చర్యలు చేపట్టనుంది. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు డయల్‌ 1930, సైబర్‌ మిత్ర వాట్సాప్‌ నంబర్‌ 9121211100, సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లను అనుసంధానిస్తూ రాష్ట్రస్థాయి కాల్‌ సెంటర్‌ను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. కేసుల నమోదు, దర్యాప్తు, అరెస్టు తదితర చట్టప్రక్రియల నిర్వహణకు ఎస్పీల ఆధ్వర్యంలో జిల్లాలవారీగా బృందాలను ఏర్పాటు చేయనున్నారు. లోన్‌ యాప్‌లు నిర్వహిస్తున్న కంపెనీలకు అనధికారికంగా సహకరిస్తున్న సంస్థలు, వ్యక్తులను గుర్తించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి సమాచారం ఇవ్వనున్నారు.

అవగాహన సదస్సులు

ఏదో ఒక అవసరం కోసం రుణం కావాల్సినవారు ఈ యాప్‌ల వలలో చిక్కుకుంటున్నారు. ఈ యాప్‌ల దారుణాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఆర్థిక నిపుణులు, ఐటీ నిపుణులతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక పోస్టర్లు, టీవీలు, సినిమా హాళ్లలో యాడ్‌ల ద్వారా కూడా ఈ యాప్‌ల దురాగతాలను వివరించనున్నారు. ఒకవేళ మోసపోతే ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలో కూడా ప్రచారం చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News