జగన్ తప్ప మిగిలిన నాయకులంతా టీడీపీలోకి..?
రాయలసీమకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, కోస్తాకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉన్నట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయట.
ఎల్లోమీడియాలో వస్తున్న వార్తలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఆవువ్యాసం లాగ తిప్పి తిప్పి జగన్మోహన్ రెడ్డిపైన బురదచల్లటమే టార్గెట్ గా నానా అవస్థలు పడుతోంది. ఇందులో భాగంగానే ఒక గదిలో కూర్చుని బుర్రకు తోచిన స్టోరీలు రాసేస్తోంది. దీనికి సాక్ష్యాలు అవసరంలేదు, ఖండనలు ఉండవు. విషయం ఏమిటంటే.. వైసీపీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిచ్చి ప్రకటన ఒకటి చేశారు.
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థిని పెడితే తామంతా ఓట్లేస్తామని వాళ్ళే తమపై ఒత్తిడి తెస్తున్నట్లు గోరంట్ల ఒక కథల్లారు. దీన్ని పట్టుకుని వెంటనే ఎల్లోమీడియా రెచ్చిపోయింది. ‘జంప్ జిలాని’ హెడ్డింగ్ తో పెద్ద కథనం అల్లేసింది. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేల భారీ వలసలని కథను అల్లేసింది. ఇందులో ఏముందంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది టీడీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారట. వారంతా చంద్రబాబు అపాయిట్మెంట్ కావాలని అడుగుతున్నారట. చంద్రబాబు అపాయిట్మెంట్ ఎప్పుడిస్తారో తెలీక కొందరు హైదరాబాద్ లోనే మకాం వేసినట్లు చెప్పింది.
రాయలసీమకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, కోస్తాకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉన్నట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయట. రాయలసీమకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలంటే ఎవరు? వైసీపీ తరపున 49 మంది ఎమ్మెల్యేలున్నారు. కోస్తాకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలన్నదేకాని ఎవరో చెప్పలేదు. స్టోరీ అంతా ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, వైసీపీకి చెందిన ఒక సీనియర్ నేత అనే ఉంది.
ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి అని రాయటానికి ఎక్కడా తిరగాల్సిన అవసరంలేదు. ఎవరితోను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అసలు సోర్సే అవసరంలేదు. ఎందుకంటే ఇలాంటి స్టోరీలన్నీ గదిలో కూర్చుని వండే వంటకాలు కాబట్టి. ఇలాంటి కల్పిత వార్తలు, కథనాలను ప్రతిరోజు అచ్చేస్తోంది కాబట్టే ఎల్లోమీడియాలో వచ్చే వార్తలను జనాల్లో చాలామంది నమ్మటం మానేశారు. పది చెత్తవార్తల మధ్యలో ఒక నిజమైన వార్తను ఇచ్చినా జనాలు నమ్మకపోవటానికి కారణం ఎల్లోమీడియా క్రెడిబులిటి పోగొట్టుకున్నది కాబట్టే.