ఎల్లోమీడియా కళ్ళుమూసుకుంటే సరిపోతుందా..?
టీడీపీ విషయానికి వస్తే చాలా జిల్లాల్లో నేతలు భగ్గముంటున్నారు. 94 నియోజకవర్గాల్లో తక్కువలో తక్కువ 25 నియోజకవర్గాల్లో సీనియర్లు, టికెట్లు దక్కని తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు.
ఎల్లోమీడియాది అచ్చం పిల్లి పద్దతిలాగే ఉంది. పిల్లి కళ్ళుమూసుకుని పాలు తాగుతూ తనను ఎవరు చూడటంలేదని అనుకుంటుందట. ఇప్పుడు ఎల్లోమీడియా అదే పద్దతిలో ఆలోచిస్తున్నట్లుంది. విషయం ఏమిటంటే.. టీడీపీ, జనసేన తరఫున పోటీచేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాను చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు. 99 నియోజకవర్గాలకు చెందిన జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్ధులుంటే మిగిలిన ఐదుమంది జనసేన అభ్యర్థులు. జనసేన ప్రకటించింది ఐదుమంది పేర్లే కాబట్టి పెద్దగా గొడవలు అవటంలేదు. కాకపోతే సీట్ల సంఖ్య విషయంలోనే మండిపోతున్నారు.
అదే టీడీపీ విషయానికి వస్తే చాలా జిల్లాల్లో నేతలు భగ్గముంటున్నారు. 94 నియోజకవర్గాల్లో తక్కువలో తక్కువ 25 నియోజకవర్గాల్లో సీనియర్లు, టికెట్లు దక్కని తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు. పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేశారు. కల్యాణదుర్గం, పెనుకొండ లాంటి నియోజకవర్గాల్లో చంద్రబాబు, లోకేష్ కటౌట్లను ధ్వంసంచేసి తగలబెట్టేశారు. సీట్లు ఆశించి దక్కని సీనియర్లు కొందరు పార్టీకి రాజీనామాలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసుల ముందు పెద్దఎత్తున నిరనసనలు తెలిపారు.
పెనుకొండ, కల్యాణదుర్గం, శింగనమల, నెల్లిమర్ల, తంబళ్ళపల్లె, పీ.గన్నవరం, రాయచోటి లాంటి చాలా నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు రెచ్చిపోయి పార్టీ ఆపీసుల్లోని ఫర్నిచర్లను ధ్వంసం చేసేశారు. దాదాపు 25 నియోజకవర్గాల్లో ఇంత గందరగోళం జరిగినా ఎల్లోమీడియాలో ఒక్క అక్షరం కూడా రాయలేదు, చూపలేదు. పైగా చంద్రబాబు మొదటిజాబితా ప్రకటనపై తమ్ముళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నట్లుగా కలరింగ్ ఇస్తోంది. పైగా ‘దూకుడుగా తొలిఅడుగు’, ‘గెలుపు గుర్రాలతో తొలిజాబితా’ అంటూ హెడ్డింగులు పెట్టి జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది.
టీడీపీ ప్రకటించిన నియోజకవర్గాల్లో జరుగుతున్న గొడవలను ఎల్లోమీడియా చూపించకపోతే జనాలకు తెలీదా..? ప్రత్యర్ధి మీడియా లేదా సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న విషయాలు జనాలకు తెలీకుండానే పోతుందా..? మీడియాను మించిపోయిన సోషల్ మీడియా ప్రతి విషయాన్ని జనాలకు ఎప్పటికప్పుడు రెండువైపులా చూపించేస్తోంది. తాము చూపించకపోతే, చెప్పకపోతే జనాలకు ఏ విషయం కూడా తెలీదనే అజ్జానంలో ఎల్లోమీడియా ఉండటమే ఆశ్చర్యంగా ఉంది. వైసీపీ అభ్యర్ధుల ఏడు జాబితాలను జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసినా ఏ నియోజకవర్గంలో కూడా గొడవలు జరగలేదు. టికెట్ దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తంచేశారంతే. దాన్ని బూతద్దంలో చూపించిన ఎల్లోమీడియా ప్రస్తుత గొడవలను మాత్రం దాచిపెట్టేసింది.