రఘురామకు సీటిచ్చిన ఎల్లో మీడియా.. నియోజకవర్గం ఏదంటే..?
పార్టీలు టికెట్ ఇవ్వకపోయినా, ఎల్లో మీడియా ద్వారా ఆయన టికెట్ వచ్చేసినట్టు సంబరపడుతున్నారు. ఆ స్థాయికి రఘురామరాజు దిగజారిపోయారంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో రఘురామ కృష్ణంరాజుని కూరలో కరివేపాకులా వాడి పడేశారు. జగన్ ని తిట్టడానికి మాత్రమే ఆయన్ను వాడుకున్నారు, తీరా ఎన్నికల వేళ హ్యాండిచ్చారు. పైగా బీజేపీ టికెట్ ఇస్తుందని టీడీపీ, టీడీపీ ఇవ్వాలని జనసేన.. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుని అసలుకే ఎసరు పెట్టారు. బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని ఆయనకు అసలు టికెట్ ఎందుకివ్వాలనే ప్రశ్న కాషాయదళం వేయడంతో టీడీపీ సైలెంట్ అయిపోయింది. ఇక రఘురామతో అంటకాగిన ఆంధ్రజ్యోతి మాత్రం మరికొన్నిరోజులు ఆయన్ను లైమ్ లైట్ లో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది.
టీడీపీ టికెట్ పై..?
రఘురామరాజుకి బీజేపీ హ్యాండిచ్చినా టీడీపీ అక్కున చేర్చుకుంటోందని, లోక్ సభ స్థానాలు ఖాళీ లేకపోవడంతో అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆయన్ను బరిలోకి దింపుతున్నారని వార్తలిస్తోంది ఆంధ్రజ్యోతి. నియోజకవర్గం కూడా ఖరారు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఆల్రడీ అభ్యర్థిని ప్రకటించిన ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన్ను బరిలో దింపుతున్నారని కూడా తేల్చేసింది. పార్టీలు టికెట్ ఇవ్వకపోయినా, ఎల్లో మీడియా ద్వారా ఆయన టికెట్ వచ్చేసినట్టు సంబరపడుతున్నారు. ఆ స్థాయికి రఘురామరాజు దిగజారిపోయారంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
వైసీపీ హవాలో, జగన్ పేరుతో 2019లో నర్సాపురం ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణంరాజు. ఆ తర్వాత జగన్ పై తిరుగుబాటు చేసి, టీడీపీ అండ చూసుకుని రెచ్చిపోయారు. జగన్ ని తిడుతున్నాడు కదా అని టీడీపీ కూడా ఆయన్ను ఎంకరేజ్ చేసింది. ఇక ఎల్లో మీడియాలో ప్యాకేజీ వార్తలు ప్రతినిత్యం వచ్చేవి. ఈ దెబ్బతో తనను తాను ఎక్కువగా ఊహించుకున్నారాయన. తీరా ఎన్నికల వేళ అన్ని పార్టీలు అసమర్థ నాయకుడంటూ ఆయన్ను వదిలించుకున్నాయి. చివరికిప్పుడు ఆయనకు అసెంబ్లీ టికెట్ అనేది కూడా ప్యాకేజీ వార్తే. టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చేది లేదు, ఆయన గెలిచేది లేదు అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.