శ్వేతపత్రం కాదు పచ్చ పత్రం.. వైసీపీ కౌంటర్

చంద్రబాబు చేసిన అప్పులను కూడా తీర్చామన్నారు. అమరావతి కోసం చంద్రబాబు చేసిన ఖర్చు, అప్పుల వివరాలు కూడా శ్వేతపత్రంలో వెల్లడిస్తే బాగుండేదన్నారు సురేష్.

Advertisement
Update: 2024-07-03 17:57 GMT

అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది వైసీపీ. చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదు.. పచ్చ పత్రం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌. కేవలం వైసీపీని టార్గెట్‌ చేయాలనే ఉద్దేశంతోనే ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారన్నారు సురేష్‌. ఐదేళ్ల పాలనలో అమరావతిలో అనేక నిర్మాణాలు చేపట్టామన్నారు. రోడ్లు, భవన నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లామని గుర్తుచేశారు.

ఇక చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు ఆదిమూలపు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు.. గతంలోనే అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. సంపద సృష్టించి ఎవరికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలనే ఉద్దేశంతోనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. గతంలో ఈ పని చంద్రబాబు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు సురేష్‌. రాజధాని ప్రకటనకు ముందే అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయని ఆరోపించారు.

జగన్‌ పాలనపై చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు ఆదిమూలపు సురేష్‌. అమరావతి స్మార్ట్ సిటీ, కోర్ కేపిటల్‌ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లామన్నారు. చంద్రబాబు చేసిన అప్పులను కూడా తీర్చామన్నారు. అమరావతి కోసం చంద్రబాబు చేసిన ఖర్చు, అప్పుల వివరాలు కూడా శ్వేతపత్రంలో వెల్లడిస్తే బాగుండేదన్నారు సురేష్. రాజధాని ప్రాంతంలో భూమి లేని కూలీలకు పెన్షన్ పెంచింది జగనేనని చెప్పారు. 9 సిటీల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేయడాన్నే వైసీపీ వ్యతిరేకించిందన్నారు. అన్ని లక్షల కోట్లు ఒకే చోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో స్కూళ్లు, అంగన్‌వాడీలు నిర్మించామన్నారు. చంద్రబాబులాగా గ్రాఫిక్స్‌లు చూపించలేదంటూ మండిప‌డ్డారు సురేష్. ఐకానిక్‌ బ్రిడ్జి సైతం పూర్తి చేశామన్నారు.

Tags:    
Advertisement

Similar News