చెప్పు చూపించాలనే కోరిక చంద్రబాబుకీ ఉందా..?
కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారని, ఆయనకు అంతకోపం ఎందుకని అన్నారు. పవన్ కల్యాణ్ లాగా పూనకం వచ్చినట్టు చంద్రబాబు ప్రవర్తించడం విచిత్రంగా ఉందన్నారు సజ్జల.
పవన్ కల్యాణ్ లాగా చంద్రబాబుకి కూడా చెప్పు చూపించాలనే కోరిక ఉందా అని ప్రశ్నించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు విన్యాసాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోందని అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారని, ఆయనకు అంతకోపం ఎందుకని అన్నారు. పవన్ కల్యాణ్ లాగా పూనకం వచ్చినట్టు చంద్రబాబు ప్రవర్తించడం విచిత్రంగా ఉందన్నారు సజ్జల.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా..?
న్యాయ రాజధానిపై మీ విధానం ఏంటి అని సీమ ప్రజలు, పౌర సమాజం చంద్రబాబుని నిలదీసిందని, వాస్తవానికి తన వాదన వినిపించేందుకు అది ఓ మంచి అవకాశంగా ఆయన భావించాల్సి ఉందన్నారు సజ్జల. అమరావతిలోనే కేంద్రీకృత రాజధాని ఎందుకు అనే విషయంపై చంద్రబాబు వివరణ ఇస్తే బాగుండేదని, కానీ ఆయన ఆగ్రహంతో ఊగిపోయారని, అసత్యాలతో విరుచుకుపడ్డారని ఎద్దేవా చేశారు.
తిట్లు.. దూషణలు.. పచ్చి బూతులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వికేంద్రీకరణ అభివృద్ధి జరిగి ఉంటే రాష్ట్ర విభజన ఇంత చేదుగా ఉండేది కాదన్నారు సజ్జల. అమరావతిలో చంద్రబాబు చెప్పే లక్ష కోట్ల రాజధాని కట్టడం అసాధ్యం అని, అమరావతి ఒక భ్రమ అని స్పష్టం చేశారు. రౌడీలకు రౌడీని అనే వ్యాఖ్యలు చంద్రబాబు బరితెగింపుకి నిదర్శనం అన్నారు సజ్జల. టీడీపీ అంటే తిట్లు, దూషణలు, పచ్చి బూతులు అంటూ కొత్త నిర్వచనం చెప్పారు. ఆ పార్టీవాళ్లే దాడి చేసి, చివరకు వారే బట్టలు చించుకుని బయటకు వచ్చి అరుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలు ప్రజలకు చివరి అవకాశమని చెబుతున్న చంద్రబాబు, ఇదేం ఖర్మ రా బాబు అని ఉంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని జగన్ ఎప్పుడూ చెప్పలేదన్నారు సజ్జల. చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం రాజధాని పూర్తి చేసి ఉంటే అప్పటి పరిస్థితిని బట్టి జగన్ నిర్ణయం తీసుకుని ఉండేవారన్నారు.