సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. చిరంజీవికి విజయసాయి కౌంటర్
ఫిలిం స్టార్స్ అయినా పొలిటీషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే.
ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసి వైసీపీ నాయకులకు టార్గెట్‌గా మారాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే వైసీపీ నాయకులు చిరంజీవిని ఇప్పటికిప్పుడు వదిలేలా కనిపించడం లేదు. నాలుగు రోజుల కిందట ప్రభుత్వంపై చిరంజీవి విమర్శలు చేయగా.. వైసీపీ మంత్రులు, నాయకులు వరుసబెట్టి కౌంటర్లు ఇస్తున్నారు.
తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. సినిమా వాళ్ల గురించి పట్టించుకోకూడదు అంటే కుదరదని ఘాటుగా వ్యాఖ్యానించారు. 'సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటీషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలాగా ప్రభుత్వం సినీ ఇండస్ట్రీపై పడిందని నాలుగు రోజుల కిందట చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే ఇందుకు సంబంధించిన ఫుల్ వీడియో తాజాగా విడుదల అయ్యింది. ఈ వీడియో చూసిన తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి పైనే చిరంజీవి పరోక్షంగా విమర్శలు చేశారని ప్రచారం జరుగుతోంది.
కొద్దిరోజుల కిందట పార్లమెంటులో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ గురించి విమర్శలు చేశారు. ఈ విమర్శలకు కౌంటర్ గానే పార్లమెంట్‌లో కూడా సినిమాల ప్రస్తావన తీసుకురావడం అవసరమా? అని చిరంజీవి విజయ్ సాయిరెడ్డిని ప్రశ్నించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయసాయిరెడ్డి స్పందించారు. చిరంజీవి పేరు ఎత్తకుండానే ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.