గోరంట్ల మాధవ్ కామెంట్స్.. కురబల సంబరాల్లో కుమ్ములాట
ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఘర్షణ తలెత్తింది. గోరంట్ల మాధవ్, పార్థసారథి వర్గీయులు ఒకరినొకరు వేదికపైనే తోసుకోవడంతో కార్యక్రమం అంతా రసాభాసగా మారింది.
అనంతపురంలో కురబల గుడికట్ల సంబరాలు రాజకీయ కామెంట్లతో రచ్చరచ్చగా మారాయి. అధికార పార్టీ నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే శంకర్ నారాయణ, విపక్షం నుంచి టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు పార్థసారథి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు సవిత, శివబాల తదితరులంతా హాజరయ్యారు. గుడికట్ల సంబరాల్లో నాయకులెవరూ రాజకీయాలు మాట్లాడకూడదని.. కురబలంతా ఐక్యంగా ఉండాలని ఆ సంఘం నాయకులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఘర్షణ తలెత్తింది. గోరంట్ల మాధవ్, పార్థసారథి వర్గీయులు ఒకరినొకరు వేదికపైనే తోసుకోవడంతో కార్యక్రమం అంతా రసాభాసగా మారింది.
నేతల్లోనే ఐకమత్యం లేదు
జిల్లాలో కురబలంతా ఐక్యంగానే ఉన్నారని, కానీ లీడర్లలోనే ఐక్యత లేదంటూ ఎంపీ మాధవ్ వ్యాఖ్యానించారు. దానికి ఈ స్టేజిపైన ఉన్న నాయకులే కారణమంటూ మాట్లాడారు. ఇది తమను ఉద్దేశించి అన్న మాటలేనంటూ పార్థసారథి వర్గం గొడవకు దిగింది. తాను కురబల ఐక్యతకు కట్టుబడి ఉన్నానంటూ కొందరు నేతల్లోనే అది లేదని మాధవ్ చేసిన వ్యాఖ్యలతో పార్థసారథి. గోరంట్ల మాధవ్ వర్గాల మధ్య వివాదం ఏర్పడి ఒకరినొకరు తోసుకోవడంతో వారిని ఆపలేక నిర్వాహకులు తలలు పట్టుకున్నారు.
కురబల ప్రాధాన్యం
అనంతపురం జిల్లాలో కురబలు (కురుమ) కులానికి చాలా ప్రాధాన్యం ఉంది. గొల్ల కురుమలు అని కూడా పిలిచే ఈ వర్గానికి బీసీల్లో ఉన్న ఓట్ల శాతాన్ని చూసే ఆ వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్‌కు వైసీపీ హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చింది. పార్టీ ఊపుతోపాటు సొంత సామాజికవర్గం మద్దతు కూడా కలిసొచ్చి మాధవ్ సీనియర్ టీడీపీ నేత నిమ్మల కిష్టప్పపై లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలిచారు. మంత్రి ఉషశ్రీచరణ్‌తోపాటు టీడీపీ నేత బీకే పార్థసారథి కూడా ఆ సామాజికవర్గం వారే కావడం విశేషం.