దేశానికి కాబోయే ప్రధాని జగన్..
వైఎస్ జగన్ ఎప్పటికైనా భావి భారత ప్రధాని అవుతారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. 2024లో ప్రజలు ఆయనకే పట్టాభిషేకం చేస్తారని చెప్పారు.
ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండిపోతారంటూ ఇటీవల కాలంలో చాలామంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఆశాభావం వ్యక్తం చేశారు. తాము చేసే అభివృద్ధి కార్యక్రమాలే తమను కలకాలం అధికారంలో ఉంచుతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. జగన్ జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతారని జోస్యం చెప్పారు. ఆయన దేశానికి ప్రధాని అవుతారని అన్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికైనా జగన్ దేశ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి.
ఆయన సీరియస్ గా ఆ వ్యాఖ్యలు చేశారా, లేక జగన్ ని ఏదో ఒకటి పొగడాలని అన్నారా అనే విషయం పక్కనపెడితే.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశ తెలుగు రాష్ట్రాల నాయకులకు ఎప్పటినుంచో ఉంది. గతంలో ఉన్న నాయకులు చక్రం తిప్పినవారే. ఉమ్మడి ఏపీకి సంబంధించి పీవీ నరసింహారావు ప్రధాని కూడా అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ పార్టీకి రంగం సిద్ధం చేశారు. కానీ జగన్ ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించిన దాఖలాలు కనిపించవు. ఆయన పొరుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా వేలు పెట్టకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. దీంతో అక్కడ షర్మిల, తండ్రి పేరుమీద మరో పార్టీ పెట్టారు. భవిష్యత్తులో జగన్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటారో లేదో వేచి చూడాలి.
జగన్ ని ప్రసన్నం చేసుకోడానికేనా..?
ఆమధ్య ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విషయంలో సీఎం జగన్ కాస్త సీరియస్ అయ్యారని సమాచారం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణలో ప్రసన్న నిర్లక్ష్యంగా ఉన్నారని క్లాస్ తీసుకున్నారట. ఆ తర్వాత గడప గడపలో ప్రసన్న స్పీడ్ పెంచారు. ఇటీవల సీఎం జగన్ ని ఆకాశానికెత్తేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన పార్టీ మారతారన్న వార్తలు కూడా ఆమధ్య వినిపించాయి. వాటిని గట్టిగానే ఖండించారు ప్రసన్న. అసలు చంద్రబాబుని తాను తిట్టినంతగా తమ పార్టీలో ఎవరూ తిట్టలేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ ని నేరుగా ప్రధాని అభ్యర్థినే చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి.