బాబు భజన చేయడానికి ఎందుకంత ఖర్మ..?
చిరంజీవి లాంటి మంచి వ్యక్తి ఉన్న కుటుంబంలో పుట్టిన పవన్ కల్యాణ్ కు, చంద్రబాబు భజన చేయాల్సినంత ఖర్మ ఎందుకని ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ పవన్ దిగజారిపోయారని మండిపడ్డారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. రెండు చోట్ల ఓడిపోయినా పవన్ కు ఇంకా సిగ్గు రాలేదని.. ఇంకా చంద్రబాబు భజనే చేస్తున్నాడని మండిపడ్డారు. జగన్ ను దించేయాలంటూ పవన్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో ఇసుక పేరుతో డబ్బులు దోచుకుంటున్నానని పవన్ తనపై ఆరోపణలు చేశారని, దమ్ముంటే నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. గుడివాడలో తనకు ఐదు లారీలు ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి నేతలు, మీడియా సంస్థలు ప్రజల సొమ్మును దోచుకున్నాయని, తమ ప్రభుత్వం టెండర్లు పిలిచి ఇసుకను విక్రయించి 4వేల కోట్ల నిధులను సమీకరించిందని వివరించారు. చిరంజీవి లాంటి మంచి వ్యక్తి ఉన్న కుటుంబంలో పుట్టిన పవన్ కల్యాణ్ కు, చంద్రబాబు భజన చేయాల్సినంత ఖర్మ ఎందుకని ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ పవన్ దిగజారిపోయారని మండిపడ్డారు.
మంగళవారం ప్రగల్భాలు..
ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే పప్పు నాయుడు చంద్రబాబు అని కొడాలి నాని ఆరోపించారు. పప్పు నాయుడు కుమారుడు తుప్పు నాయుడు మంగళవారం మాటలు మాట్లాడుతున్నాడని.. వారం రోజుల్లో జగన్ వ్యవహారం బయటపెడతానంటూ వాగుతున్నాడని.. పోయిన మంగళవారమే ఆ వ్యవహారం బయటపెట్టొచ్చు కదా అని నిలదీశారు. ఉత్తర కుమార ప్రగల్భాలు దేనికని ప్రశ్నించారు. గుడివాడలో క్యాసినో జరగలేదని చెప్పారు. చీకోటి ప్రవీణ్ పై ఈడీ దాడుల విషయంలో తనను లాగాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
పనికిమాలిన వీడియోలపై మాట్లాడేందుకు గ్రీష్మ, అనిత లాంటి మహిళా నేతల్ని తెరపైకి ఎందుకు తెచ్చారని నిలదీశారు కొడాలి నాని. ఫేక్ వీడియోతో ఎంపీ మాధవ్ పై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అమెరికా రిపోర్ట్ అంటూ బోగస్ రిపోర్ట్ తీసుకొచ్చి అందర్నీ నమ్మించాలనుకున్నారని, చివరకు ఆ ప్రయత్నం కూడా విఫలమైందని చెప్పారు.