లోకేశ్ ట్రాప్‌లో పడిపోయారా..? - యువగళం బాగానే వర్కవుట్ అవుతోందే..
లోకేశ్ ఏ నియోజకవర్గంలోకి ఎంటర్ అయినా అక్కడి మంత్రి లేదా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు తొలుత పెద్దగా స్పందన రాలేదు. లోకేశ్ నోరు జారితే ట్రోల్స్ చేసేందుకు వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా రెడీ అయ్యింది. అయితే ప్రారంభంలో కాస్త తడబడ్డ లోకేశ్ .. ఆ తర్వాత బాగానే సక్సెస్ అవుతున్నట్టు కనిపిస్తోంది. లోకేశ్ పాదయాత్ర కోసం టీడీపీ రాజకీయ సలహాదారు రాబిన్ శర్మ నేతృత్వంలోని టీమ్ గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేస్తోంది.
లోకేశ్ ఏ నియోజకవర్గంలోకి ఎంటర్ అయినా అక్కడి మంత్రి లేదా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజానికి వెంకట్రామిరెడ్డికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనపైనే లోకేశ్ అవినీతి ఆరోపణలు చేశారు. చెరువు భూమిని కబ్జా చేశారని.. కొన్ని ఫొటోలు కూడా బయటపెట్టారు. దీంతో కేతిరెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
తాజాగా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీద లోకేశ్ ఆరోపణలు చేశారు. దీంతో సాయి ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కౌంటర్ ఇచ్చారు. అయితే లోకేశ్ పాదయాత్ర పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకు సాగుతోంది. నిత్యం ఆయన ఏదో ఒక నేత మీద ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. కొన్ని చోట్ల పాదయాత్రను అడ్డుకుంటున్నారు కూడా.. ఇది టీడీపీ టీమ్ కు కలిసి వస్తోంది. ఎందుకంటే.. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు రియాక్ట్ అయితేనే యువగళంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలుగుదేశం శ్రేణులకు, రాబిన్ శర్మకు కావాల్సింది కూడా అదే. ఒకవేళ వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వకపోతే ఆరోపణలను ఒప్పుకున్నట్టు అవుతుంది.
మరోవైపు యువగళం పాదయాత్రకు అటు టీడీపీ సోషల్ మీడియా, ఇటు అనుకూల పత్రికలు, చానళ్లల్లోనూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల మంత్రి సురేశ్.. లోకేశ్ దళితులపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ చేసిన అర్ధనగ్న ప్రదర్శన కూడా కాస్త బూమరాంగ్ అయ్యింది. మొత్తంగా లోకేశ్ పాదయాత్రకు వైసీపీ శ్రేణులు ఫ్రీ పబ్లిసిటీ కల్పిస్తున్నాయి.
లోకేశ్ కూడా తెలివిగా.. ఏ నియోజకవర్గానికి వెళితే అక్కడి ఎమ్మెల్యేపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గతంలో జగన్ పాదయాత్ర నిర్వహించినట్టుగానే.. లోకేశ్ కూడా ప్రజలను కలుస్తూ అందుకు కావాల్సిన పబ్లిసిటీ పొందుతున్నారు. జనం ప్రశ్నలు అడగడం వాటికి లోకేశ్ సమాధానం చెప్పడం ఇదంతా స్క్రిప్ట్ లో భాగమేనన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తంగా లోకేశ్ పాదయాత్ర వైసీపీ శ్రేణులు ఆశించినట్టు అట్టర్ ప్లాప్ అయితే కాలేదు. ఎంతో కొంత సక్సెస్ అయ్యిందని చెప్పక తప్పదు.