బాబు సీఎం అవలేడు.. అయ్యన్న హోంమంత్రి కాలేడు.. వైసీపీ నేతల ఫైర్

వైసీపీ నేతల అండతో దౌర్జన్యానికి పాల్పడుతున్న పోలీసుల లిస్టు రాసుకుని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి.. తాను హోం మంత్రిని అయ్యాక వారిపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇస్తానని అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

Advertisement
Update:2023-01-21 12:28 IST

పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది లేదని, అలాగే అయ్యన్నపాత్రుడు హోంమంత్రి కాబోయేది లేదని వారు విమర్శించారు. ఇటీవల అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల అండతో దౌర్జన్యానికి పాల్పడుతున్న పోలీసుల లిస్టు రాసుకుని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి.. తాను హోం మంత్రిని అయ్యాక వారిపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడు చేసిన ఈ కామెంట్స్ పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ పై తాజాగా వైసీపీ నేతలు మండిపడ్డారు. నిజాంపట్నంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం అయ్యేది లేదని, అలాగే అయ్యన్నకు హోంమంత్రి పదవి వచ్చేది లేదన్నారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని చంద్రబాబు కలలు కంటుంటే, అయ్యన్నపాత్రుడు హోం మంత్రిని అవుతానని కలలు కంటున్నారని మండిపడ్డారు. వారి కలలు సాకారం అయ్యే ప్రసక్తే లేదన్నారు. అయ్యన్నకు చంద్రబాబులాగే మతి భ్రమించిందని అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మోపిదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు స్పందిస్తూ అయ్యన్న తీరు చూస్తుంటే అప్పుడే ఎన్నికలు జరిగి టీడీపీ విజయం సాధించినట్లు, తానేదో హోం మంత్రి పదవి పొందినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని వ్యాఖ్యానించారు. అయ్యన్న కలలు కనడం మాని వాస్తవ ప్రపంచంలోకి రావాలని హితవు పలికారు. పోలీసుల బట్టలు ఊడదీస్తామని అయ్యన్న వ్యాఖ్యానించారని.. నాలుగు రోజులు ఆగితే అదే పోలీసులు అయ్యన్న బట్టలు ఊడదీస్తారని ఎమ్మెల్యే ముత్యాల నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags:    
Advertisement

Similar News