అవి నిరసనల్లా లేవు.. పండగ చేసుకుంటున్నట్టుంది..
అరెస్టుపై కోర్టులో వాదించుకోకుండా ప్లేట్లు మోగించడం వంటి చర్యలు చేపట్టడమేమిటని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. అవినీతి కేసులో అరెస్టయి కోర్టు ఆదేశాలతో జైలులో ఉన్నప్పుడు ఆందోళనలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. దీన్ని నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనలు, ఆందోళనలు చూస్తుంటే.. అవి నిరసనల్లా కాకుండా బాబు అరెస్టును వారంతా పండగ చేసుకుంటున్నట్టుగా ఉన్నాయని శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆందోళనలు, నిరసనల పేరుతో టీడీపీ చేస్తున్న కార్యక్రమాలను పరిశీలిస్తే.. ఒక్కరిలో కూడా తమ నాయకుడు అరెస్టయినందుకు బాధ కనపడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
అయినా అరెస్టుపై కోర్టులో వాదించుకోకుండా ప్లేట్లు మోగించడం వంటి చర్యలు చేపట్టడమేమిటని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. అవినీతి కేసులో అరెస్టయి కోర్టు ఆదేశాలతో జైలులో ఉన్నప్పుడు ఆందోళనలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇలాంటి ఆందోళనలతో ప్రజల్లో ఎగతాళి కావొద్దని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. రోడ్లపైకి వెళ్లి గొడవ చేస్తే ప్రభుత్వం లొంగిపోదని, న్యాయ వ్యవస్థ ప్రభావితం కాదనే విషయాన్ని.. టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలని చెప్పారు. తాను తప్పు చేయలేదని అనుకున్నప్పుడు చంద్రబాబు ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉంటే బాగుండేదన్నారు.