బాబు, పవన్ అనైతిక పొత్తులపై ప్రజలకు సమాధానం చెప్పాలి
గతంలో వర్షం వస్తే ఒంగోలు జలమయమయ్యేదని, కానీ ఇప్పుడు చుక్క నీరు కూడా నిలబడకుండా అభివృద్ధి చేసి చూపించామని బాలినేని చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని చెప్పారు.
తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్ మద్దతిచ్చారని, పవన్ కల్యాణ్ బీజేపీకి పొత్తు పెట్టుకున్నారని, ఆంధ్రాలో పవన్, చంద్రబాబు కలిసి పోటీకి సిద్ధమవుతున్నారని, వీరికి నైతికత లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వీరు తమ అనైతిక పొత్తులపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాపట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తే అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకిల్‌పై వచ్చి పరామర్శించాడా అని ఆయన ప్రశ్నించారు. తుపాను తీవ్రతపై సీఎం వైఎస్ జగన్ ప్రజలకు ముందుగానే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారని ఆయన చెప్పారు. అందుకే ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు.
గతంలో వర్షం వస్తే ఒంగోలు జలమయమయ్యేదని, కానీ ఇప్పుడు చుక్క నీరు కూడా నిలబడకుండా అభివృద్ధి చేసి చూపించామని బాలినేని చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని చెప్పారు. అందుకే ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తోందని తెలిపారు. 2024 ఎన్నికల్లో తాను అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని బాలినేని స్పష్టం చేశారు. మళ్లీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డే అని తాను నిక్కచ్చిగా చెబుతున్నానని ఆయన చెప్పారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ వారు సంబరాలు చేసుకుంటున్నారని బాలినేని ఎద్దేవా చేశారు. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాదులో సెటిలర్స్ ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ గెలిచిందని ఆయన చెప్పారు. అదే అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ టీడీపీ వాళ్లు ఇప్పటికీ సంబరాలు చేసుకునేవారని ఆయన విమర్శించారు. గ్రేటర్ హైదరాబాదులో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందనే విషయం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో తేలిపోయిందన్నారు.