కాలగర్భంలో మాధవ్ వీడియో.. కానీ..!

కొండంత రాగం తీసి.. దాన్ని తుస్సుమనిపించారు. రోజులు గడిచేకొద్దీ ఎంపీ మాధవ్ పై చర్యలు తీసుకోవ‌డానికి వైసీపీ సిద్ధంగా లేదు అనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Advertisement
Update:2022-08-09 10:05 IST

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో బయటపడిన వెంటనే రాష్ట్రమంతా ఒక్కసారిగా అలజడి రేగింది. అప్పటికప్పుడు వైసీపీ నేతల మాటలు వింటే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటారనే అంచనాకు వచ్చారంతా. తప్పని తేలితే కఠిన చర్యలంటూ ఒకరికి పదిమంది నేతలు అదే మాట వల్లెవేయడంతో, వైసీపీ కార్యకర్తలు కూడా ఏదో సంచలనం జరిగే అవకాశముందనే అంచనాకి వచ్చారు. కానీ కొండంత రాగం తీసి.. దాన్ని తుస్సుమనిపించారు. రోజులు గడిచేకొద్దీ ఎంపీ మాధవ్ పై చర్యలు తీసుకోవ‌డానికి వైసీపీ సిద్ధంగా లేదు అనే సంకేతాలు వెలువడుతున్నాయి.

బ్రీఫ్డ్ మీ తో పోలిక..

మాధవ్ వీడియో బయటకొచ్చిన వెంటనే, దాన్ని టీడీపీ పైకి నెట్టేసే ప్రయత్నం బలంగా జరిగింది. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన మాధవ్ నేరుగా అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని తెరపైకి తెచ్చారు. మరో నలుగురైదుగురి పేర్లు చెప్పి మార్ఫింగ్ చేశారంటూ మండిపడ్డారు. ఆయన మినహా వైసీపీ నేతలెవరూ టీడీపీని టార్గెట్ చేయలేదు. ఆ తర్వాత కొంతమంది కఠిన చర్యలన్నారే కానీ, మాధవ్ ని వెనకేసుకు రాలేదు. ఇటీవల మంత్రి రోజా మాధవ్ కి సపోర్ట్ గా మాట్లాడినట్టు వార్తలొచ్చాయి, ఆ తర్వాత సాక్షాత్తూ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అది ప్రైవేట్ వీడియో అని, తమకు ఫిర్యాదులేవీ అందలేదని అనేశారు. అంటే ఫిర్యాదే లేకపోతే ఇక విచారణ, చర్యలు అనేవి లేవని పరోక్షంగా హింటిచ్చినట్టయింది. అక్కడితో ఆగకుండా గతంలో చంద్రబాబు బ్రీఫ్డ్ మీ అనే వివాదాన్ని కూడా సజ్జల తెరపైకి తెచ్చారు. సో.. ఇక్కడ మాధవ్ వర్సెస్ న్యూడ్ వీడియో వ్యవహారం.. వైసీపీ వర్సెస్ టీడీపీ అనేలా రూపుమార్చుకుంది. అంటే మాధవ్ ని వైసీపీ వెనకేసుకు రావడానికే నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతుంది.

మాధవ్ సేఫ్ జోనేనా..?

విచారణ పూర్తి కానివ్వండి, టైమ్ పడుతుంది కదా, తర్వాత చర్యలు తీసుకుంటాం.. అనేది వైసీపీ వాదన. అసలు విచారణ చేస్తోంది ఎవరు? టెక్నికల్ నిపుణులా, రాజకీయ నేతలా, పోలీసులా..పార్టీనా..? దీనిపై క్లారిటీ లేదు. మధ్యలో సామాజిక వర్గం కూడా బలంగా తెరపైకి వచ్చింది కాబట్టి.. సొంత పార్టీ అంత సాహసం చేస్తుందని ఎవరూ అనుకోవడంలేదు. పోనీ చర్యలు తీసుకున్నా సభ్యసమాజం వైసీపీ గొప్ప పార్టీ అని పొగిడేయదు, క్లీన్ చిట్ ఇవ్వదు, పైగా టీడీపీ మరింతగా రెచ్చిపోతుంది. సో తనపై తానే బురదజల్లుకోని, కడిగేసుకోవడం మంచిది కాదని వైసీపీ ఆలోచిస్తోంది. అంటే మార్ఫింగ్ వీడియోగానే మాధవ్ వీడియో కాలగర్భంలో కలసిపోక తప్పదు.

నెక్స్ట్ ఏంటి..?

ఇప్పటికిప్పుడు మాధవ్ పై చర్యలు తీసుకోకపోయినా.. ఆయన రాజకీయ భవితవ్యం మాత్రం ప్రమాదంలో పడినట్టే అనుకోవాలి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ అనుమానమే. ఒకవేళ జగనే ఆయన తరఫున ప్రచారం చేసినా స్థానికంగా ఉన్న వివాదాలతో ఆయన గెలుస్తారని అనుకోలేం. సో కచ్చితంగా జగన్ ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చనే అంచనాలున్నాయి. అదే నిజమైతే.. ఆ వీడియోకి అదే సరైన శిక్ష అనుకోవాలి. అంటే ఇటు పార్టీకి నష్టం లేకుండా, అటు మాధవ్ లాంటి వారిని ఎంకరేజ్ చేయకుండా వైసీపీ సేఫ్ గేమ్ ఆడుతోంది అనుకోవాల్సిందే. ఈలోగా మాధవ్ తో రాసుకు పూసుకు తిరగడాన్ని వైసీపీ నేతలు అవమానంగా భావించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags:    
Advertisement

Similar News