5న వచ్చేయ్.. స్పష్టత ఇస్తా- రామ్‌కుమార్‌ రెడ్డి ఫైర్

ఇదివరకు తనను విలేకరులు వెంకటగిరి నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నిస్తే అది పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పానని, ఒకవేళ మరొకరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం తాను కృషి చేస్తానని మాత్రమే తాను చెప్పానని వివరించారు.

Advertisement
Update:2022-12-31 12:27 IST

సొంత ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. సాధారణంగా అయితే వివాదం వచ్చినప్పుడు పిలిచి నాలుగు గోడల మధ్య చర్చించుకునే వారమని.. కానీ ఆనం రామనారాయణరెడ్డి నలుగురిలో మాట్లాడారు కాబట్టి తాను కూడా బహిరంగంగానే సమాధానం చెప్పాల్సి వస్తోందన్నారు.

ఒక పెద్దమనిషి సీటు కోసం వెంపర్లాడుతున్నారంటూ ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడింది తన గురించేనని రామ్‌కుమార్ రెడ్డి చెప్పారు. అసలు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తారా? లేక ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారా..? అన్న గందరగోళాన్ని సృష్టించుకున్నదే ఆనం రామనారాయణరెడ్డి అని విమర్శించారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే నాలుగైదు ఏళ్ల తర్వాత ఆనం వివేకానంద రెడ్డి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారన్న విషయం కూడా అందరికీ తెలుసు అని విమర్శించారు.

ఇదివరకు తనను విలేకరులు వెంకటగిరి నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నిస్తే అది పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పానని, ఒకవేళ మరొకరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం తాను కృషి చేస్తానని మాత్రమే తాను చెప్పానని వివరించారు. తాను కుర్చీల కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదన్నారు రామ్‌కుమార్‌రెడ్డి. వెంకటగిరి నియోజకవర్గంతో తమది ప్రత్యేకమైన అనుబంధం ఉంద‌న్నారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసినప్పటికీ ఆ పార్టీ పట్ల ఉన్న నిబద్ధత కారణంగానే తాను పోటీ చేశానని వివరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొద్దిమేర వెనుకబడి ఉంది మన ఓట్లు కూడా వేస్తే వైసీపీ గట్టెక్కుతుందని.. తన అనుచరులు వచ్చి కోరితే వారంతా వైసీపీకి ఓటు వేసుకునే వెసులుబాటును కూడా తాను ఆరోజు కల్పించాలని, అంతేకానీ తనకే ఓటు వేయాలంటూ పట్టుపట్టలేదని కూడా రామ్ కుమార్ రెడ్డి వివరించారు. అప్పటివరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో లేని తాను పోటీ చేసి 5000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ తరఫున సాధించానని వివరించారు. అదే మంత్రిగా పనిచేసి మంత్రి హోదాలోని ఆత్మకూరు నుంచి పోటీ చేసిన ఆనం రామనారాయణరెడ్డి కేవలం ఎనిమిది వేల ఓట్లు మాత్రమే సాధించారని, విపరీతమైన అభివృద్ధి చేసి ఉంటే అన్ని తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయని రామ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

2014 ఎన్నికల తర్వాత ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకొని ఆత్మకూరు నియోజకవర్గానికి అప్రకటిత ఎమ్మెల్యేగా పనిచేశారని విమర్శించారు. ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె టీడీపీలో చేరి ఆత్మకూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని.. ఇవేవీ ప్రజలకు తెలియవు అనుకుంటున్నారా అని కూడా రామ్‌ కుమార్‌ రెడ్డి నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకే ఒక్క మంచి వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారని.. అలా ఎందుకు చెప్పారో కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదన్నారు.

కొందరు కార్యకర్తలు తమ వద్దకు వచ్చి జనసేనలో కూడా ఆనం రామనారాయణరెడ్డి కర్చీఫ్‌ వేశారా అని మాట్లాడుతున్నారని చెప్పారు. పదిమందిలో మాట్లాడేటప్పుడు మీ వయసుకు, అనుభవానికి ఆలోచించి మాట్లాడాలి కదా అని ప్రశ్నించారు. శిలాఫలకంపై తన పేరు కూడా ఉండడానికి వీలు లేదన్నట్టుగా ఆనం రామనారాయణరెడ్డి వ్యవహరిస్తున్నారని, నేదురుమల్లి అన్న పేరు చూస్తేనే భయమా..? అని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల సమయంలోనూ ఇంటికి వచ్చి ఎన్నికల్లో సాయం చేయాల్సిందిగా తనను అడగలేదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో తామంతా చిత్తశుద్ధితో రామనారాయణరెడ్డి గెలుపు కోసం పని చేశామన్నారు.

కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ అభ్యర్థిని ఎంపిక చేసింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి, అందరం కలిసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాల్సిందేనని తాను అందరికీ సర్ది చెప్పానని రామ్ కుమార్ రెడ్డి వివరించారు. జనవరి 5న తిరుపతిలో తానే సమావేశం ఏర్పాటు చేస్తున్నానని, ఆ సమావేశానికి జిల్లాలోని ఏడు స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, పరిశీలకులు, ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడి హోదాలో తాను వస్తామని ఆనం రామనారాయణ రెడ్డి కూడా అక్కడికి వస్తే ఆయనకున్న అనుమానాలపై స్పష్టత ఇస్తామని రామ్ కుమార్ రెడ్డి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News