రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిన వైసీపీ

ఆర్థిక ఉగ్రవాది ఏం చేశారో గత ఐదేళ్లలో చూశామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల ధ్వజం

Advertisement
Update:2024-11-15 13:15 IST

ప్రతిపక్షం లేకుండా సాగుతున్న ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ మంత్రులు వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌పై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. ఆర్థిక ఉగ్రవాది ఏం చేశారో గత ఐదేళ్లలో చూశామని మంత్రి పయ్యావుల కేశవు విమర్శించారు. బడ్జెట్‌పై ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టారని అన్నారు. గత ప్రభుత్వ వైఖరితో అనేకమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. పిల్లలకు ఇచ్చే చిక్కీల బిల్లలూ పెండింగ్‌లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కనపెట్టిందని, పోలవరం పనులు నిలిపివేసి డయాఫ్రం వాల్‌ విధ్వంసానికి కారణమయ్యారని మండిపడ్డారు.

భూకబ్జాలకు అరికట్టడానికి ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం

మరో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్‌ చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 25 వేల ఎకరాలు అమ్మకాలు, రిజిస్ట్రేషన్‌ జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా 7,837 ఎకరాల్లో అక్రమాలు జరిగాయన్నారు. భూకబ్జాలకు అరికట్టడానికి ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం తెస్తున్నామని చెప్పారు. భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా శిక్షలు ఉంటాయని అనగాని తెలిపారు.

వైసీపీ సభ్యుల వాకౌట్‌

రాష్ట్రంలో వైద్య కలాశాలల నిర్మాణంపై శాసనమండలి ఓ దుమారం చెలరేగింది. మెడికల్‌ కాలేజీ నిర్మాణం విషయంలో నాటి సీఎం జగన్‌ వివక్ష చూపెట్టారని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. పులివెందుల కాలేజీకి తప్ప.. మిగిలిన ఏ కాలేజీ నిర్మాణానికి సరిపడా నిధులివ్వలేదన్నారు. లెక్చరర్లకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్లనే ఈ ఏడాది మెడికల్‌ కాలేజీల నిర్వహణకు జాతీయ వైద్య మండలి అనుమతివ్వలేదన్నారు. దీనికంతటికీ కారణమైన జగన్‌ మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో తాడేపల్లి ప్యాలెస్‌ నిర్మించుకున్న జగన్‌.. మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు పూర్తిచేయలేకపోయారని ధ్వజమెత్తారు. మంత్రి సమాధానం జరిగా లేదంటూ వైసీపీ సభ్యులు వాకౌట్‌ చేశారు. 

Tags:    
Advertisement

Similar News