విమర్శలపై మహి వి.రాఘవ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్‌ చేయటానికి ఎవరూ ఆసక్తి చూపించరని చెప్పారు. ఓ వర్గం మీడియా దీని గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదని విమర్శించారు.

Advertisement
Update:2024-02-12 19:56 IST

దర్శకుడు మహి వి.రాఘవ్‌ తనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇటీవలే యాత్ర–2 చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. 2019లోనూ ఆయన రూపొందించిన ‘యాత్ర’ చిత్రం కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మినీ స్టూడియో ఏర్పాటు కోసం దర్శకుడు మహి వి.రాఘవ్‌కు ఏపీ ప్రభుత్వం ఇటీవల రెండెకరాల భూమి కేటాయించింది. అయితే.. దీనిపై ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు విపరీతంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన తాజాగా స్పందించారు.

రాయలసీమకు సినీ ఇండస్ట్రీ ఏం చేసిందో చెప్పాలని ఈ సందర్భంగా దర్శకుడు మహి వి.రాఘవ్‌ ప్రశ్నించారు. తన ప్రాంతం కోసం తన వంతుగా ఏదో ఒకటి చేయాలనే ఆశయంతో కేవలం రెండు ఎకరాల భూమిలోనే మినీ స్టూడియో నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్‌ చేయటానికి ఎవరూ ఆసక్తి చూపించరని చెప్పారు. ఓ వర్గం మీడియా దీని గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదని విమర్శించారు. వాళ్ల ప్రభుత్వంలో వాళ్లకు నచ్చినవారికి ఎవరెవరికో ఎక్కడెక్కడో భూములు ఇచ్చారని, వాటి గురించి ఎవరూ మాట్లాడరని ఆయన మండిపడ్డారు.

రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉంటున్నానని.. మూన్‌ వాటర్‌ పిక్చర్స్, 3 ఆటమ్‌ లీవ్స్‌ అనే రెండు నిర్మాణ సంస్థలను స్థాపించినట్లు మహి తెలిపారు. తన సినిమాలు పాఠశాల, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది, సైతాన్‌ వెబ్‌ సిరీస్‌ రాయలసీమలోనే చిత్రీకరించినట్లు చెప్పారు. తన ప్రాంతం కోసం కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలనుకుంటే దీనిపై పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మహి వి. రాఘవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశయం లేకపోతే.. తాను హైదరాబాద్‌లోనో.. వైజాగ్‌లోనో స్టూడియో కట్టుకోవటానికి స్థలం కావాలని అడిగేవాడిని కదా అని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతంగా చూసే మదనపల్లిలోనే ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటానని వివరించారు. మదనపల్లిలో సినిమాలు చేయటం వల్ల స్థానికంగా ఉపాధి ఏర్పడుతుందని భావించానన్నారు. బుద్ధి ఉన్నోడెవడైనా దీని గురించి ఆలోచించాలి. నా స్టూడియో నిర్మాణం కోసం యాభై, వంద ఎకరాలు అడగలేదని, కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాలనుకున్నానని చెప్పారు. రాయలసీమకు ఎవరైనా ఏమైనా చేశారా! మీరు చేయరు... చేసేవాడిని చెయ్యనియ్యరు.. ఓ వర్గం మీడియా దీని గురించి కాస్త కూడా ఆలోచించలేదంటూ దర్శకుడు మహి మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News