'ప్రజలే ఫస్ట్' అనే విధానంతో పనిచేయండి
రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలులో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సీఎం సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలులో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఐవీఆర్‌ఎస్‌తో పాటు వివిధ రూపాల్లో లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరించారు. గ్రామస్థాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్ బ్యాక్‌పైనా అధికారుల నివేదిక తీసుకున్నారు.
'ప్రజలే ఫస్ట్' అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఏడు శాఖల్లో పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం యత్నిస్తున్నదని చంద్రబాబు తెలిపారు.