2 ఎక‌రాల నుంచి రూ. 668 కోట్ల‌కు..

ఏడీఆర్ నివేదిక ప్ర‌కారం దేశంలోనే మూడో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు.. అంటే సీఎం జగన్ ఆస్తుల కన్నా ఎమ్మెల్యేగా చంద్రబాబు ఆస్తులే రూ. 157 కోట్లు ఎక్కువ. ఏడీఆర్ విడుదల చేసిన నివేదికలోనే రెండు వివరాలు ఉన్నప్పటికీ ఎల్లో మీడియా చంద్రబాబు ఆస్తుల విషయాన్ని పూర్తిగా దాచేసి కేవలం జగన్ ఆస్తులను మాత్రమే బాగా హైలైట్ చేసింది.

Advertisement
Update:2023-04-14 11:24 IST

గుడివాడ పర్యటనలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే పేపర్లు, టీవీలు, వ్యాపారాలు లేవని చెప్పిన జగన్ ఏమి చేసి రూ. 510 కోట్ల ఆస్తి సంపాదించారని. దేశంలోని ముఖ్యమంత్రులందరి ఆస్తి రూ. 505 కోట్లయితే ఒక్క జగన్ ఆస్తి మాత్రమే రూ. 510 కోట్లని జనాలకు వివరించారు. అంత ఆస్తిని జగన్ ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికను భగవద్గీత స్థాయిలో చంద్రబాబు పదే పదే ప్రస్తావించారు.

నిజమే, రాజకీయ నేతలు సంపాదించిన ఆస్తుల వివరాలను జనాలకు వివరించాల్సిన అవసరం ఉంది. ప్రజా జీవితంలో ఉన్న‌ప్పుడు తమపై వచ్చిన ప్రతి ఆరోపణలకు సమాధానం చెప్పితీరాల్సిన బాధ్యత నేతలపైన ఉంటుంది. కాబట్టి చంద్రబాబు అడిగారని కాకపోయినా ఆస్తులు ఎలా వచ్చాయో జగన్ జనాలకు సమాధానం చెబితే బాగుంటుంది. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే అదే ఏడీఆర్ నివేదిక దేశంలోనే మూడో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు అని కూడా చెప్పింది. చంద్రబాబు ఆస్తులు రూ. 668 కోట్లు.

అంటే ముఖ్యమంత్రిగా జగన్ ఆస్తుల కన్నా ఎమ్మెల్యేగా చంద్రబాబు ఆస్తులే రూ. 157 కోట్లు ఎక్కువ. ఏడీఆర్ విడుదల చేసిన నివేదికలోనే రెండు వివరాలు ఉన్నప్పటికీ ఎల్లో మీడియా చంద్రబాబు ఆస్తుల విషయాన్ని పూర్తిగా దాచేసి కేవలం జగన్ ఆస్తులను మాత్రమే బాగా హైలైట్ చేసింది. ఎల్లో మీడియా చెప్పకపోతే విషయం జనాలకు తెలీదనే భ్రమలో చంద్రబాబు ఉండటమే విచిత్రం.

జగన్ చెప్పినట్లే చంద్రబాబు కూడా చేతికి ఉంగరం లేదు, వాచీ కూడా లేదని కొన్ని వందలసార్లు చెప్పుంటారు. ఉంగరం, వాచీ కూడా పెట్టుకోలేని వ్యక్తికి రూ. 668 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది? చంద్రబాబు ఏం చేసి జగన్‌కు మించిన ఆస్తులను సంపాదించగలిగారు? జగన్ తండ్రి వైఎస్సార్ దివంగత ముఖ్యమంత్రి. మరి చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు కేవలం 2 ఎకరాలున్న రైతు మాత్రమే కదా. మరి తాను ఏం చేసి రూ. 668 కోట్ల ఆస్తిని సంపాదించారో చంద్రబాబు జనాలకు చెప్పగలరా?

Tags:    
Advertisement

Similar News