జగన్ హ్యాట్రిక్ కొడతారా?

న్యాయస్థానాల్లో రెండు వరుస తీర్పులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా వచ్చాయి. ఇదే సమయంలో మూడు రాజధానుల అంశాన్ని కూడా సుప్రీంకోర్టు జూలైలో విచారించ‌నుంది.

Advertisement
Update:2023-05-06 12:26 IST

ఇప్పుడు వైసీపీలో ఇదే చర్చ జరుగుతోంది. న్యాయస్థానాల్లో రెండు వరుస తీర్పులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా వచ్చాయి. రెండు కూడా కీలకమైన తీర్పులే అని చెప్పాలి. ఇదే సందర్భంలో కోర్టులిచ్చిన రెండు తీర్పులు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీతో పాటు ప్రతిపక్షాలన్నింటికీ పెద్ద షాకనే చెప్పాలి. అందుకనే తొందరలో రాబోయే మూడో తీర్పు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుందా అనే చర్చ పెరిగిపోతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే శుక్రవారం నాడు రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వకూడదని అమరావతి జేఏసీ ముసుగులో టీడీపీ నేతలు వేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. ముందు హైకోర్టులోనే కేసు వేస్తే అత్యవసరమని జేఏసీ తొందరపెట్టింది. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళమని చెప్పటంతో జేఏసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ జేఏసీకి బాగా తలంటుపోసింది. కేసు ఉపసంహరించుకుంటారా లేకపోతే కొట్టేయమంటారా అని అడిగితే కేసు ఉపసంహరించుకున్నారు. వెళ్ళి హైకోర్టులోనే తేల్చుకోమని సుప్రీంకోర్టు చెప్పటంతో మళ్ళీ ఇక్కడ కేసు వేశారు. ఆ కేసునే ఇప్పుడు కోర్టు కొట్టేసింది.

కోర్టు తీర్పుతో అమరావతి ప్రాంతంలో సుమారు 50 వేల మందికి పట్టాలు ఇవ్వటానికి 1134 ఎకరాల్లో పది లేఅవుట్లు రెడీ అయిపోయాయి. ఈనెల 15వ తేదీలోగా పట్టాల పంపిణీ పూర్తిచేయాలని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుకుంటుంది. ఇంతకుముందు అమరావతి ముసుగులో జరిగిన భూకుంభకోణంతో పాటు ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తదితరాల కుంభకోణాలపై సిట్ విచారణ చేయచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై ఎందుకు ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోకూడదో చెప్పమని పిటీషనర్లను అడిగింది. దానికి పిటీషనర్లకు ఏమి సమాధానం చెప్పలేకపోవటంతో కేసు కొట్టేసి విచారణ చేసుకోమని తీర్పు చెప్పింది. నిజానికి ఈ రెండు తీర్పులు కూడా ప్రతిపక్షాలన్నింటికీ మింగుడుపడనివనే చెప్పాలి. ఇదే సమయంలో మూడు రాజధానుల అంశాన్ని కూడా సుప్రీంకోర్టు విచారిస్తోంది. జూలైలో విచారణ జరగబోతోంది. రెండు వరుస కేసులు ప్రభుత్వానికి అనుకూలంగా రావటంతో మూడో కేసు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అందుకనే మూడో కేసు తీర్పు కోసం అధికార పార్టీ ఎదురుచూస్తోంది.

Tags:    
Advertisement

Similar News