మంగళగిరిలో లోకేష్ స్వయంకృషి ఫలిస్తుందా..?
2019 ఎన్నికల్లో మంత్రిగా ఉండి కూడా మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు నారా లోకేష్. తిరిగి అదే నియోజకవర్గంపై ఆయన దృష్టిపెట్టారు.
2019 ఎన్నికల్లో మంత్రిగా ఉండి కూడా మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు నారా లోకేష్. తిరిగి అదే నియోజకవర్గంపై ఆయన దృష్టిపెట్టారు. మిగతా నాయకుల సంగతి ఎలా ఉన్నా.. లోకేష్ మాత్రం మంగళగిరి చుట్టూనే తిరుగుతున్నారు. స్థానికంగా తోపుడుబండ్లవారికి బండ్లు సమకూర్చారు, ప్రతి శుభకార్యానికి తన టీమ్ ని పంపిస్తూ బహుమతులు అందిస్తూ ఆ ఫొటోలను ప్రచారం చేసుకుంటున్నారు. నేతన్నల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శిస్తున్నారు. మొత్తమ్మీద వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు అంత హుషారుగా తిరుగుతున్నారో లేదో కానీ, లోకేష్ మాత్రం అంతకు మించి అన్నట్టుగా కష్టపడుతున్నారు.
సొంత ఖర్చుతో రోడ్లు..
ఇటీవల బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పర్యటించారు లోకేష్. రత్నాల చెరువు సమీపంలో వర్షాలకు రోడ్లు ధ్వంసం కావడంతో స్థానికులనుంచి ఆయనకు ఫిర్యాదులందాయి. దీంతో ఆయన తన సొంత ఖర్చుతో అక్కడ వారం రోజుల్లోగా రోడ్లు వేయించారు. ఓవైపు ప్రభుత్వం నుంచి నవరత్నాల పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుంటే.. తనకెవరు ఓట్లు వేస్తారనుకున్నారేమో.. తానే స్వయంగా రంగంలోకి దిగి డబ్బులు ఖర్చు పెడుతున్నారు.
ప్రతిష్టాత్మకం..
2024లో టీడీపీ గెలిచినా గెలవకపోయినా.. ఎమ్మెల్యేగా లోకేష్ అసెంబ్లీలో అడుగుపెట్టడం మాత్రం అనివార్యం. అందుకే లోకేష్ ముందు జాగ్రత్తపడుతున్నారు. మంగళగిరిలో డబ్బులు కుమ్మరిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నా.. ఓట్లకోసం ఆమాత్రం చేయక తప్పదనేది టీడీపీ వాదన. అయితే ఇంత చేసినా స్థానిక చేనేత సామాజిక వర్గం మాత్రం లోకేష్ కి దూరమయ్యేలా ఉంది. మాజీ ఎమ్మెల్యే గంజి చిరంజీవి, టీడీపీకి రాజీనామా చేయడంతో ఆ వర్గం దూరమయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ అదే సామాజికవర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకి ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది. వచ్చే దఫా ఇక్కడ చేనేత వర్గానికి చెందినవారికే వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశముందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో లోకేష్ లో మరోసారి భయం మొదలైంది.
ఆ రెండూ జగన్ టార్గెట్..
సీఎం జగన్ ఈసారి సీరియస్ గా టార్గెట్ చేసిన రెండు నియోజకవర్గాల్లో కుప్పం, మంగళగిరి ఉన్నాయి. ప్రస్తుతానికి మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యేనే ఉన్నా.. 2024లో ఎట్టిపరిస్థితుల్లో దాన్ని చేజార్చుకోకూడదనే వ్యూహంతో ఉన్నారు జగన్. అటు కుప్పంలో కూడా పగడ్బందీగా వ్యూహ రచనలు చేస్తున్నారు. మంగళగిరిలో చేనేత వర్గాన్ని దగ్గరకు తీస్తూ, లోకేష్ కి రెండేళ్ల ముందుగానే షాకులిస్తున్నారు వైసీపీ నేతలు. మంగళగిరిలో లోకేష్ స్వయంకృషి ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.