కేశినేని బలిపశువేనా..?

ఏ పార్టీలో ఉన్నా సుజనా మాత్రం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తుంటారనే ఆరోపణలకు కొదవలేదు. కాబట్టి పొత్తుంటే అధికారికంగానే సుజనా కూటమి అభ్యర్థిగా పోటీచేస్తారు.

Advertisement
Update:2024-01-14 10:48 IST

ఏపీలో ఎన్నిక‌లు స‌మ‌యం స‌మీపిస్తున్న వేళ విజయవాడ కేంద్రంగా అనేక సంచలనాలు జరగబోతున్నాయి. విజయవాడ పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా కేశినేని నాని పోటీచేయబోతున్నారు. టీడీపీ తరఫున నాని తమ్ముడు కేశినేని చిన్ని పోటీ ఖాయమైంది. ఇక బీజేపీ తరఫున పోటీచేసేందుకు కేంద్ర మాజీమంత్రి సుజనా చౌద‌రి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. టీడీపీ-జనసేన పొత్తులో బీజేపీ చేరుతుందా లేదా అన్నదే తేలలేదు.

రెండుపార్టీలతో బీజేపీ చేతులు కలిపినా, కలపకపోయినా నష్టపోయేది కేశినేని చిన్నీయే అనే టాక్ పార్టీలో మొదలైంది. చంద్రబాబు ఆటలో ఎంతోమంది బలైపోతుంటారు. ఇప్పుడు బలైపోయేందుకు చిన్నీ రెడీగా ఉన్నారని తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎలాగంటే.. బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ ఖాయం. ఒకవేళ కూటమిలో బీజేపీ చేరినా పోటీచేసేది మాత్రమే సుజనానే అని తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. పొత్తులో విజయవాడ సీటును చంద్రబాబు బీజేపీకి కేటాయించేయటం ఖాయం. ఎందుకంటే.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో సుజనా కూడా ఒకళ్ళని అందరికీ తెలిసిందే.

ఏ పార్టీలో ఉన్నా సుజనా మాత్రం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తుంటారనే ఆరోపణలకు కొదవలేదు. కాబట్టి పొత్తుంటే అధికారికంగానే సుజనా కూటమి అభ్యర్థిగా పోటీచేస్తారు. ఒకవేళ పొత్తు లేకపోతే బీజేపీ తరఫున పోటీచేస్తారంతే. ఏ విధంగా పోటీచేసినా చంద్రబాబు మద్దతు మాత్రం సుజనాకే ఉంటుందని తమ్ముళ్ళలో చర్చ మొదలైంది. బీజేపీ తరఫున పోటీచేయబోతున్న సుజనా గెలుపున‌కే టీడీపీలోని చాలామంది పనిచేస్తారనటంలో సందేహంలేదు. సుజనా టీడీపీలో ఉన్నప్పుడు చాలామందితో సన్నిహితంగా ఉండేవారు. సుజనా ప్రకటన తర్వాత టీడీపీలో కూడా సమీకరణలు మారిపోతున్నాయట.

ఇక సామాజికవర్గంలో కూడా కేశినేని చిన్నీతో పోల్చుకుంటే సుజనాకు మద్దతిచ్చే వాళ్ళే ఎక్కువమంది ఉంటారు. అంటే సుజనా పేరుకు మత్రమే బీజేపీ ఎంపీ అభ్యర్థి. ఈయనకు పనిచేసే వాళ్ళల్లో ఎక్కువమంది తమ్ముళ్ళు, సామాజికవర్గంలో ప్రముఖులే. మరింతమంది సుజనా గెలుపుకోసం పనిచేసేటప్పుడు ఇక చిన్నీని పట్టించుకునే వాళ్ళెవరు..? సుజనా, చిన్నీల్లో చంద్రబాబు మొదటి ఆప్షన్ సుజనానే అనటంలో సందేహంలేదు. ఎంపీ కేశినేని నాని మీద కోపంతో చిన్నీని చంద్రబాబు ఎంకరేజ్ చేశారు కానీ, చిత్తశుద్దితో కాదని అందరికీ తెలిసిందే. కాబట్టి కేశినేని చిన్ని బలిపశువు అవటానికే ఎక్కువ అవకాశాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News