జగన్ ముక్కుసూటి రాజకీయాలే చేటు తెస్తున్నాయా?
పార్టీపై అసమ్మతి గళం వినిపిస్తున్నవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలోనూ మొహమాటాలు, నాన్చుడు ధోరణి చూపించలేదు. ఒక్కసారి కమిటైతే ఆయన మాటే ఆయన వినరనేలా జగన్ వ్యవహారశైలిపై వైసీపీ నేతలకి నమ్మకం ఏర్పడింది.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రస్తుత రాజకీయ నేతల శైలికి భిన్నం. దూకుడు ఆయన విజయ రహస్యం. ఎంత నష్టమైనా ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన తీరు. కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నాడు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నాడు. కేసులు ఎదుర్కొన్నాడు. అరెస్టయి జైలులో 16 నెలలున్నా తన యాటిట్యూడ్ ని మార్చుకోలేదు. ఇదే జగన్‌కి జనంలో క్రేజ్ తీసుకొచ్చింది. నేతలు వెంట నడిచేందుకు కారణమైంది.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సీటు అయిన నంద్యాల.. భూమా నాగిరెడ్డి మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఓడిపోయినందుకు జగన్ చెప్పిన మాట ఇప్పటికీ వైసీపీ కేడర్ కి పెద్ద భరోసా.. కొట్టారు, తీసుకున్నాం.. మా టైము వచ్చినప్పుడు బలంగా కొడతాం అంటూ ఓటమిని ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నాడో చూసి టీడీపీ నేతలే ఆశ్చర్యపోయారు.
ఎవరితో పొత్తులు లేకుండా ఒంటరిగా 175 సీట్లలో పోటీచేసి 151 సీట్లు గెలిచి అప్రతిహత విజయం సాధించారు. దేశమే నివ్వెరపోయేలా 22 మంది ఎంపీల్ని గెలిపించుకున్నారు. సీఎం అయి నాలుగేళ్లు పూర్తవుతున్న తరుణంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దూకుడు ఏమైనా తగ్గించుకున్నారా అంటే లేదనే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ టికెట్ ఇవ్వనంటే వారు టీడీపీ అభ్యర్థికి ఓటేస్తారని తెలిసినా, ముందు రోజు వచ్చి కలిసిన ఎమ్మెల్యేలకు కూడా మీకు సీటు లేదనే చెప్పగలిగేంత ముక్కుసూటి మనిషి. మీరు మన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి, తరువాత చూద్దామని మోసం చేయలేదు.
పార్టీపై అసమ్మతి గళం వినిపిస్తున్నవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలోనూ మొహమాటాలు, నాన్చుడు ధోరణి చూపించలేదు. ఒక్కసారి కమిటైతే ఆయన మాటే ఆయన వినరనేలా జగన్ వ్యవహారశైలిపై వైసీపీ నేతలకి నమ్మకం ఏర్పడింది. ఈ ముక్కుసూటితనం వల్లే వైసీపీలో ఓ నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని వదులుకునేందుకు కూడా సిద్ధం అయ్యారు. అయితే రాజకీయాలంటే రాజీ ధోరణి ఉండాలే కానీ, ఇలా నో మొహమాటం అనే ధోరణితో రానురానూ పార్టీకే నష్టం అనే వాదన వినిపిస్తోంది.