ఆంధ్రాలో ఆటవిక పాలన సాగుతోంది.. - మాజీ ఎంపీ రెడ్డప్ప ఆగ్రహం
ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై టీడీపీ నేతలు హత్యాయత్నం కేసులు పెట్టారు. ఒకవైపు వైసీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న టీడీపీ గూండాలు.. ఎవరిపై దాడులకు పాల్పడుతున్నారో వారిపైనే తిరిగి కేసులు పెడుతుండటంపై మాజీ ఎంపీ రెడ్డప్ప మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటవిక పాలన సాగుతోందని మాజీ ఎంపీ రెడ్డప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రైతుల ముసుగులో తన ఇంటిపైనే దాడికి తెగబడి.. తిరిగి తమపైనే కేసులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్‌రెడ్డి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు వారిపై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, వైసీపీ నేతలకు చెందిన వాహనాలను టీడీపీ అల్లరి మూకలు ధ్వంసం చేశారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది.
తాజాగా ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై టీడీపీ నేతలు హత్యాయత్నం కేసులు పెట్టారు. ఒకవైపు వైసీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న టీడీపీ గూండాలు.. ఎవరిపై దాడులకు పాల్పడుతున్నారో వారిపైనే తిరిగి కేసులు పెడుతుండటంపై మాజీ ఎంపీ రెడ్డప్ప మండిపడ్డారు. టీడీపీ నేతలు తమపై తప్పుడు కేసులు పెట్టడం.. దానిపై పోలీసులు కేసులు నమోదు చేయడం కక్షసాధింపు చర్యలో భాగమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా ఇంటిపై దాడి జరిగితే మాపైనే కేసులు పెడతారా? అంటూ రెడ్డప్ప ఈ సందర్భంగా నిలదీశారు. మాపై దాడులకు పోలీసులే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు.. వాహనాలు ధ్వంసం చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు.. మిథున్‌రెడ్డి, నేను ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేదు.. మాపై హత్యాయత్నం కేసులు ఎలా నమోదు చేస్తారు.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందిన పోలీసులు, తమ వాహనాలు ధ్వంసం చేస్తుంటే చోద్యం చూసిన పోలీసులు తమపైనే తిరిగి రెండు కేసులు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన ధ్వజమెత్తారు.