ముందస్తు ఎన్నికలు తప్పదా?
ముందస్తు ఎన్నికలకు నరేంద్ర మోడీ అనుమతి కూడా తీసుకున్నట్లు మీడియాలో ప్రచారం పెరిగిపోతోంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మోడీకి జగన్ వివరించారని, ముందస్తుకు వెళితే జరిగే ఉపయోగాన్ని వివరించి చెప్పినట్లు ప్రచారం మొదలైంది.
ముందస్తు ఎన్నికలపై జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. కానీ ప్రతిపక్షాల నేతలు, మీడియా మాత్రం పదే పదే ముందస్తు ఎన్నికలు ఖాయమని బాగా ప్రచారం చేస్తున్నాయి. రెండు రోజుల ఢిల్లీ టూర్ ముగించుకుని జగన్ తిరిగిరాగానే ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయంటు గోల మొదలైపోయింది. ముందస్తు ఎన్నికలకు నరేంద్ర మోడీ అనుమతి కూడా తీసుకున్నట్లు మీడియాలో ప్రచారం పెరిగిపోతోంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మోడీకి జగన్ వివరించారని, ముందస్తుకు వెళితే జరిగే ఉపయోగాన్ని వివరించి చెప్పినట్లు ప్రచారం మొదలైంది.
జగన్ వాదనకు మోడీ కూడా సానుకూలంగా స్పందించారని అందుకనే జగన్ ఇంత హ్యాపీగా ఉన్నారనే విశ్లేషణలు మొదలైపోయాయి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 2023 - 24 బడ్జెజ్ సమావేశాల తర్వాత అసెంబ్లీని జగన్ రద్దు చేసే అవకాశాలున్నట్లుగా ప్రచారం పెరిగిపోతోంది. అంటే దాదాపు ఏడాది ముందే అసెంబ్లీ రద్దయ్యే అవకాశాలున్నట్లు మీడియా అంచనా వేస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటి నుండో చెబుతునే ఉన్నారు.
సరే చంద్రబాబు అంటే రోజుకో మాట చెబుతారు. తమ్ముళ్ళు, క్యాడర్ పార్టీ నుండి బయటకు వెళ్ళిపోకుండా చూసుకోవటంలో భాగంగా ఏ క్షణంలో అయినా అసెంబ్లీ రద్దవుతుందని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం తమకు లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే క్లారిటి ఇచ్చారు. అయితే జగన్ మనసులోని మాట మాత్రం ఎవరికీ ఇంతవరకు తెలీదు.
జగన్ తీసుకునే నిర్ణయాలు చివరి నిమిషం వరకు ఎవరికీ తెలీకుండా జాగ్రత్తపడతారని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. కాబట్టి ముందస్తు ఎన్నికల విషయంలో కూడా ఇదే జరుగుతుందనటంలో సందేహం లేదు. ముందస్తుకు వెళితే తనకు ఉపయోగం ఉంటుందని జగన్ నూరు శాతం నమ్మితేనే అందుకు ఆలోచిస్తారు. ఫలితంపై ఏమాత్రం అనుమానం ఉన్నా ఏడాది పదవీ కాలాన్ని ఎందుకు ఎవరు మాత్రం వదులుకుంటారు? మరి తాజా కథనాల ప్రకారం వచ్చే మార్చి - ఏప్రిల్లో అసెంబ్లీ రద్దయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.