జగన్‌పై కత్తితో దాడి: తిమ్మిని బమ్మిని చేసి ఉల్టా బనాయింపు
ఎన్‌ఐఎ దర్యాప్తులో వెల్లడైన విషయాలను కూడా ఈనాడు దినపత్రిక గానీ, ఆంధ్రజ్యోతి దినపత్రిక గానీ పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. తాము చెప్పిందే నిజమనే పద్ధతిలో వార్తాకథనాలను రాస్తున్నాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభూత కల్పనల కథనాలను సృష్టిస్తూ ప్రజలను మభ్య పెట్టడానికి రామోజీరావుగారి ఈనాడు దినపత్రిక పడుతున్న పాట్లు చూస్తుంటే నవ్వు రాక తప్పదు. 2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై జరిగిన దాడికి సంబంధించిన వాస్తవాలను మరుగుపరిచి కాకమ్మ కబుర్లు వండి వారుస్తుంది. తాజాగా ఈనాడులో వచ్చిన వార్తాకథనం ఏ మాత్రం వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదనేది అర్థమవుతుంది. అసలు జగన్‌పై దాడి చేసిన శ్రీనివాసరావు ఎవరి మనిషి, అతను ఏ విధంగా దాడి చేశాడు, ఎందుకు చేశాడు అనే విషయాలను వెలుగులోకి వచ్చినప్పటికీ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి వత్తాసు పలుకుతూ రాయడం వెనుక ఈనాడు ఆంతర్యం ప్రజలకు అర్థం కాకుండా పోదు.
ఎన్‌ఐఎ దర్యాప్తులో వెల్లడైన విషయాలను కూడా ఈనాడు దినపత్రిక గానీ, ఆంధ్రజ్యోతి దినపత్రిక గానీ పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. తాము చెప్పిందే నిజమనే పద్ధతిలో వార్తాకథనాలను రాస్తున్నాయి. జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్ విశాఖ విమానాశ్రయంలో టిడిపి గాజువాక నాయుడు హర్షవర్దన్ చౌదరికి చెందని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. ఈ జనుపల్లి శ్రీనివాస్ పాత నేరస్థుడు కూడా. అతనికి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇప్పించి విమానాశ్రయంలోని రెస్టారెంట్‌లో పనికి చేర్చుకుని పథకం ప్రకారం జగన్‌పై దాడి చేయించారు. జగన్‌ను హత్య చేయడానికే జనుపల్లి శ్రీనివాస్ దాడి చేశాడని ఎన్‌ఎఐ దర్యాప్తులో తేలింది. అయినప్పటికీ ఆ హత్యాప్రయత్నం ఉత్త బూటకమనే పద్ధతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వార్తాకథనాలను రాస్తున్నాయి.
ఎన్‌ఎఐ చార్జిషీట్‌లోని ప్రధానాంశాలు ఇవీ..
వైఎస్ జగన్‌పై దాడి చేసి హత్య చేయడానికి జనుపల్లి శ్రీనివాస్ ప్రయత్నించాడని ఎన్‌ఐఎ కోర్టులో దాఖలు చేసిన తన చార్జిషీట్‌లో స్పష్టం చేసింది, ఆ చార్జిషీట్‌లోని అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
నిందితుడు శ్రీనివాస్ తన అరచేతిలో ఇమిడిపోయేంత పదునైన కత్తితో వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకు దాడికి పాల్పడ్డాడు. జగన్ మెడ భాగంలో కత్తితో పొడిచి హత్య చేయాలనేది శ్రీనివాస్ టార్గెట్. అయితే, జగన్ ఎడమ భుజంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైంది. మెడపై గల సున్నితమైన ప్రాంతంలో కత్తితో దాడి చేస్తే నరాలు తెగి మెదడుకు రక్తప్రసరణ ఆగిపోతుందని, దాంతో దాడికి గురైన వ్యక్తి మరణించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తమ నివేదికలో స్పష్టం చేశారు. దీన్నిబట్టి జగన్‌పై జరిగిన దాడి ఆషామాషీ వ్యవహారం కాదని, యాదృశ్చికం కాదని ఆ వివరాలను బట్టి స్పష్టంగా అర్థమవుతున్నది. అయినప్పటికీ దాన్ని ఈనాడు మీడియా పట్టించుకోకుండా అబద్ధాలను ప్రచారం చేస్తూ వస్తుంది.
రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ఎవరు?
జగన్‌పై దాడి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్‌లో పనిచేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే చెబుకున్నట్లు ఆ రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ చౌదరి తెలుగుదేశం పార్టీ గాజువాక నాయకుడు. జగన్‌పై దాడి జరిగిన సమయంలో టిడిపి అధికారంలో ఉంది. హర్షవర్దన్ చౌదరి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడని తెలుస్తుంది. 2014 ఎన్నికల్లో హర్షవర్దన్ గాజువాక టికెట్ కూడా ఆశించారు. ఆయన విశాఖ విమానాశ్రయంలో రెస్టారెంట్‌ను 2017లో దక్కించుకున్నాడు. అప్పుడు టిడిపి సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు కేంద్ర పౌర విమాన యాన సరీస్వుల మంత్రిగా ఉన్నారు.
వైఎస్ జగన్‌పై 2018 అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాప్రయత్నం జరిగింది. అప్పటికి 9 నెలల ముందు, అంటే 2018 జనవరి 30వ తేదీన టిడిపి యలమంచిలి నేత సుందరపు విజయ్‌కుమార్ సిఫార్సుతో హర్షవర్దన్ శ్రీనివాస్‌కు రెస్టారెంటులో ఉద్యోగం ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆయనే ఎన్‌ఐఏ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ విశాఖపట్నం విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు వెళ్లి వస్తారనే విషయం పక్కాగా తెలుసు కాబట్టి దాడికి ప్లాన్ వేశారు.
అధికారుల సూచనను కూడా పెడచెవిన పెట్టి..
జనుపల్లి శ్రీనివాస్‌పై ఆయన స్వస్థలం తానేలంకలో పలు ఆరోపణలున్నాయి. ముమ్మిడివరం పోలీసు స్టేషన్‌లో క్రిమినల్ కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని విమానాశ్రయంలోని రెస్టారెంటులో ఉద్యోగంలో పెట్టుకోవడానికి పక్కాగా ప్లాన్ చేసి అమలు చేశారు. రెస్టారెంట్ యజమానే విశాఖ ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుని ఎయిర్‌పోర్టు అథారిటీకి సమర్పించారు. జనుపల్లి శ్రీనివాస్‌కు ఏ విధమైన నేరచరిత్ర లేదని కూడా ఆయనే నిర్ధారించారు. తానేలంక ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీసు స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఎయిర్‌పోర్టు పోలీసు అధికారులు చెప్పినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా హర్షవర్దన్ తన రెస్టారెంట్‌లో శ్రీనివాస్‌కు ఉద్యోగం కల్పించారు.
నిందితుడి మాటల్లో కూడా..
అయితే, జగన్ దాడి నుంచి తప్పించుకున్నారు. జగన్‌పై దాడి జరిగిన కొద్ది క్షణాల్లోనే టిడిపి దుష్ప్రచారానికి తెర తీసింది. శ్రీనివాస్ వైసిపి సానుభూతిపరుడని, జగన్‌పై సానుభూతి రావడానికి దాడి చేశాడని టిడిపి నాయకులు మాట్లాడారు.
నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ గతంలో ఓసారి బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆ సమయంలో అతను మీడియాతో మాట్లాడాడు. తాను సానుభూతి తీసుకురావడానికి జగన్‌పై దాడి చేయలేదని అతను స్పష్టంగా చెప్పాడు. అయినా కూడా టిడిపి అనుకూల మీడియా తమ దుష్ప్రచారాలను, వక్రభాష్యాలను ఆపలేదు.
పలు అనుమానాల నివృత్తికి..
జగన్‌పై జరిగిన దాడి విషయంలో తలెత్తిన పలు అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి సమగ్ర దర్పాప్తు జరిపించాలని ఎన్‌ఐఎను, కోర్టును కోరుతూ జగన్ తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. జగన్‌పై జరిగిన దాడిలో తేలాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్‌కు నిందితుడు శ్రీనివాస్‌కు ఉన్న సంబంధం ఏమిటి? పాత నేరస్థుడైనప్పటికీ శ్రీనివాస్‌ను ఉద్యోగంలో ఎలా చేర్చుకున్నారు? విమానాశ్రయంలో జగన్‌కు కాఫీ ఇవ్వడానికి శ్రీనివాస్‌నే ఎందుకు పంపించారు? ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలానే ఉన్నాయి.
జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్ ఉదంతాన్ని పక్కదారి పట్టించడానికి, దర్యాప్తునూ, న్యాయప్రక్రియనూ ప్రభావితం చేయడానికి టిడిపి, దాని అనుకూల మీడియా ఎందుకు ప్రయత్నిస్తుందనేది ప్రధానమైన ప్రశ్న. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని కాపాడేందుకు నిరంతరం ఎందుకు ప్రయత్నిస్తున్నాయనేది కూడా ప్రశ్న.