25 సీట్లలో కూడా పోటీ చేయలేని జనసేనకు పెద్దమాటలెందుకు?
వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు సిద్ధం అంటూ పోస్టర్లు పెడితే వాటికి పక్కనే పవన్ ఫొటోతో మేమూ సిద్ధం అంటూ జనసేన కటౌట్లు పెట్టారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ప్రకటించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్లీజ్ కనీసం 30 సీట్లన్నా ఇవ్వండని చంద్రబాబును బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్కిల్ కేసులో జైల్లో ఉన్నప్పుడు పవన్ మద్దతు కోసం అర్రులు చాచిన చంద్రబాబు ఇప్పుడు జనసేనానిని తూచ్ అనేస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్నటి భేటీలో పవన్ 32 సీట్ల వరకు అడిగితే 20 సీట్ల వరకు చంద్రబాబు ఓకే చెప్పారు. గట్టిగా బేరమాడితే మరో 5 సీట్లు ఇస్తారన్నట్లు టీడీపీ అనుకూల మీడియా సంస్థలు ఊదరగొడుతున్నాయి.
ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్పా?
టీడీపీ, చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నానంటూ భుజం కాసిన పవన్‌కు ఇప్పుడు ఆ పార్టీ ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదని నిన్నటి చర్చల సారాంశాన్ని బట్టి తెలుస్తోంది. గౌరవం లేని పొత్తు మనకెందుకు అని జనసైనికులు మరోవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, పవన్ మాత్రం వైసీపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారు. ఓటు చీలకుండా ఉండటానికి ఏం చేయడానికైనా సిద్ధమేనని కామెంట్లు చేస్తున్నారు.
జనసేన సిద్ధం పోస్టర్లపై కామెంట్లు
వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు సిద్ధం అంటూ పోస్టర్లు పెడితే వాటికి పక్కనే పవన్ ఫొటోతో మేమూ సిద్ధం అంటూ జనసేన కటౌట్లు పెట్టారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. 151 సీట్లున్న నాయకుడు మళ్లీ గెలుస్తామని ధైర్యంగా మేం `సిద్ధం` అని పెట్టాడంటే అర్థం ఉంది. తాను పోటీ చేసిన రెండు చోట్ల గెలవలేని పవన్ కల్యాణ్ దేనికి సిద్ధం..? చంద్రబాబుకు చెంచాగిరీ చేయడానికా..? ఎక్కడ పోటీ చేస్తానో చెప్పడానికి ధైర్యంలేని పవన్ కూడా సిద్ధం అని పోస్టర్లు వేస్తున్నారంటే ఏమనుకోవాలి..? అయినా పాతిక సీట్లలోఅయినా పోటీ చేస్తారో లేదో తెలియని వపన్ దేనికి సిద్ధం..? అంటూ సెటైర్లు పేలిపోతున్నాయి.