వైసీపీ: వైనాట్ 175 - ఉద్యోగులు: వైనాట్ OPS
పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న OPS ఏపీలో ఎందుకు అమలు కాదని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. CPS రద్దు చేసి OPS అమలు చేస్తామంటేనే జగన్ కి ఓటువేశామని అంటున్నారు.
తలచుకుంటే సాధ్యం కానిదేదీ లేదు, అందుకే వైసీపీ వైనాట్ 175 అనే నినాదం అందుకుంది. అదే స్ఫూర్తితో ముందుకెళ్తామంటున్నారు ఏపీ ఉద్యోగులు. ప్రభుత్వం తలచుకుంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్(OPS) కూడా సాధ్యంకాకుండా పోదని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్(GPS)ని ఒప్పుకునేది లేదని తెగేసి చెబుతున్నారు.
మంత్రుల కమిటీ సమావేశంలో హై డ్రామా..
ఆమధ్య ప్రభుత్వం ప్రతిపాదించిన GPSకు ఉద్యోగులు ఒప్పుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఉద్యోగ సంఘాల్లోని కొందరు నేతలు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారని, తాము మాత్రం ఆ ప్రతిపాదన ఒప్పుకునేది లేదని అంటున్నారు మిగతా నాయకులు. ఈరోజు GPSపై సచివాలయం రెండో బ్లాక్ లో మంత్రుల కమిటీ సమావేశం మొదలైంది. మంత్రులు బొత్స, బుగ్గన, సీఎస్ జవహర్‌రెడ్డి, సజ్జల, ఆర్థికశాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆస్కార్ రావు తదితరులు హాజరయ్యారు. ఉపాధ్యాయ సంఘాలు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. GPS ఆర్డినెన్స్ లోని అంశాలు బయటకు చెప్పకుండా చర్చలేమిటని OPS సాధన సమితి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్-1న తేల్చుకుందాం..
పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న OPS ఏపీలో ఎందుకు అమలు కాదని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. CPS రద్దు చేసి OPS అమలు చేస్తామంటేనే జగన్ కి ఓటువేశామని అంటున్నారు. ఇప్పుడు GPS అంటూ తమని ఏమార్చే ప్రయత్నం చేయొద్దని అల్టిమేట్టం ఇచ్చారు. సెప్టెంబర్ 1న వైనాట్ OPS అంటూ చలో విజయవాడకు పిలుపునిచ్చామని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరతామంటున్నారు. OPS విషయంలో సానుకూలంగా స్పందించకపోతే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సైతం సిద్ధంగా ఉన్నామంటున్నారు నేతలు.