దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం మాకేముంది? టీడీపీపై పెద్దిరెడ్డి ఫైర్

ఎన్నికల్లో గెలవలేని వారు, కనీసం టికెట్ కూడా తెచ్చుకోలేనివారు తనపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారందరికీ వచ్చేనెల 4న ప్రజలే తగిన సమాధానం చెబుతారని పెద్దిరెడ్డి అన్నారు.

Advertisement
Update:2024-05-20 11:25 IST

ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, ఓటమి తర్వాత పెద్దిరెడ్డి కుటుంబం దేశం విడిచి వెళ్తుందని ఇటీవల పలువురు టీడీపీ నాయకులు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై తాజాగా పెద్దిరెడ్డి స్పందించారు. దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం తమ కుటుంబానికి ఏముందని ఆయన టీడీపీ నాయకులను ప్రశ్నించారు. తాను, తన కుమారుడు, తమ కుటుంబం రాజకీయాల్లోకి రాక ముందు నుంచే వ్యాపారాలు చేస్తున్నట్లు పెద్దిరెడ్డి చెప్పారు.

ఆఫ్రికన్ దేశాల్లో తమ కుటుంబానికి వ్యాపారాలు ఉన్నాయని, దీనికోసం అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుంటామన్నారు. దీనిని పట్టుకొని కొందరు టీడీపీ పనిలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ కుటుంబంపై విమర్శలు చేస్తున్న వారి స్థాయి ఏంటో అందరికీ తెలుసని చెప్పారు. రాజకీయాల్లో తమ కుటుంబం సంపాదించింది ఏమీ లేదని, వ్యాపారాల్లో వచ్చిన సొమ్మునే రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నట్లు వివరించారు.

ఎన్నికల్లో గెలవలేని వారు, కనీసం టికెట్ కూడా తెచ్చుకోలేనివారు తనపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారందరికీ వచ్చేనెల 4న ప్రజలే తగిన సమాధానం చెబుతారని పెద్దిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్‌ పెరగడానికి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమని ఆయన వివరించారు.

ప్రభుత్వ లబ్ధిపొందిన వారే క్యూలలో నిలబడి ఓటేశారని చెప్పారు. మహిళా ఓటు బ్యాంకు పెరగడానికి తమ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలే కారణమని పెద్దిరెడ్డి అన్నారు. మహిళలు భారీగా తరలివచ్చి ఓటు వేయడం తమకు అనుకూలంగానే భావిస్తున్నట్లు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News