ఇందుకేనా సుప్రీంలో కేసు వేసింది..?

కేసు విచారణ సందర్భంగా రైతుల వాదనను హైకోర్టు కొట్టేసింది. పేదలకు ఇళ్ళపట్టాలిస్తే మీకొచ్చిన సమస్య ఏమిటని నిలదీసింది. అమరావతి ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇవ్వకూడదని ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించింది.

Advertisement
Update:2023-04-07 12:16 IST

ప్రభుత్వం ఏర్పాటుచేయాలని అనుకున్న ఆర్-5 జోన్‌ను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలోని కొందరు రైతులు వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. మొదట్లో వీళ్ళు హైకోర్టులోనే పిటీషన్ వేశారు. అయితే హఠాత్తుగా హైకోర్టును కాద‌ని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హైకోర్టును కాదని ఢిల్లీలో ఉన్న సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయించినట్లు..? అందులోనూ మొదట హైకోర్టులోనే కేసు వేసి ఎందుకు వెంటనే వద్దనుకున్నారు..? ఎందుకంటే.. తమ పిటీషన్ విషయంలో హైకోర్టు మూడ్ వీళ్ళకి అర్థ‌మైపోయిందట.

విషయం ఏమిటంటే.. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వటానికి 1,150 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. పట్టాలు ఇవ్వటానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. దాంతో రైతులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని ప్రాంతంలో బయటవాళ్ళకు ఇళ్ళపట్టాలు ఇచ్చేందుకు వీల్లేదని అభ్యంతరం చెప్పారు. తమ భూముల్లో పేదలకు ఇళ్ళపట్టాలు ఇస్తే `సామాజిక‌ సమతుల్యం` దెబ్బతింటుందన్నది వాళ్ళ వాదన.

కేసు విచారణ సందర్భంగా రైతుల వాదనను హైకోర్టు కొట్టేసింది. పేదలకు ఇళ్ళపట్టాలిస్తే మీకొచ్చిన సమస్య ఏమిటని నిలదీసింది. అమరావతి ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇవ్వకూడదని ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించింది. పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వటం అభివృద్ధిలో భాగమే కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. రైతుల భూములను సీఆర్డీఏకి ఇచ్చేసిన తర్వాత ఇక వాటిపై రైతులకు హక్కు ఎక్కడిద‌ని గట్టిగా అడిగింది. సీఆర్డీఏకి సొంతమైన భూములను ఎవరికైనా ఇచ్చుకుంటుందని తేల్చేసింది.

విచారణలో హైకోర్టు అడిగిన ప్రశ్నలకు రైతుల నుంచి సమాధానం లేదు. విచారణలోనే హైకోర్టు తీరు ఇలాగుంటే ఇక తీర్పు ఎలాగుండబోతోంది అనే విషయం రైతులకు అర్థ‌మైపోయినట్లుంది. పైగా ఈ కేసును అర్జెంటుగా విచారించాల్సినంత అవ‌స‌రం లేదని కూడా చెప్పేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే కేసులు వేస్తున్నారంటూ కోర్టు మండిపడింది. కేసుపై అర్జెంటుగా విచారణ జరగాలని అనుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్ళమని సూచించింది. కోర్టు వ్యాఖ్యలు చూసిన తర్వాత రైతులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. మరి ఇక్కడ ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News