టీడీపీ సభలో వైసీపీ విజయాలు ఏకరువు పెట్టిన ఎంపీ
పల్నాడు అభివృద్ధికి కారకుడైన జగన్ ని కాదని, ఇప్పుడు చంద్రబాబు పార్టీకి ఓటు వేయాలని సదరు ఎంపీ అడగడమే ఆ సభలో హాస్యాస్పదం అనుకోవాలి.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు టీడీపీ కండువా కప్పుకున్నారు. టికెట్ లేదని తేలిపోవడంతో కొన్నిరోజులుగా ఓ వ్యూహం ప్రకారం వైసీపీపై విమర్శలు చేస్తున్న ఆయన టికెట్ హామీతోనే టీడీపీలో చేరారు. నర్సరావుపేట నుంచే ఆయన తిరిగి పోటీ చేయబోతున్నారు. దాచేపల్లిలో జరిగిన ‘రా.. కదలిరా’ సభలో టీడీపీలో చేరిన లావు.. అదే సభలో వైసీపీ విజయాలను ఏకరువు పెట్టడం విశేషం.
పల్నాడు అభివృద్ధి జగన్ హయాంలోనే..
పల్నాడు అభివృద్ధికి తాను కృషి చేశానని చెప్పుకునే క్రమంలో పరోక్షంగా జగన్ విజయాలను ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు ప్రస్తావించడం విశేషం. వరికపూడిసెల ప్రాజెక్టుకి అటవీ అనుమతులకోసం తాను కృషి చేశానన్నారు లావు. అటవీ అనుమతులు తెచ్చిన ఆయనే అన్ని గొప్పలు చెప్పుకుంటే మరి ప్రాజెక్ట్ పూర్తి చేసిన జగన్, పల్నాడుకి ఎంత మేలు చేసినట్టు. పల్నాడు ప్రాంతాన్ని జాతీయ రహదారులతో కలిపేందుకు రూ.3000 కోట్ల కేంద్ర నిధులు తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు ఎంపీ. ఆ నిధులు సీఎం జగన్ ని చూసి కేంద్రం మంజూరు చేసింది కానీ, ఎంపీని కాదనే విషయం ఆయనకు తెలియదా అంటున్నారు వైసీపీ నేతలు. పల్నాడుకు కేంద్రీయ విద్యాలయాలు, రైతుల కోసం 400 కిలోమీటర్ల డొంక రోడ్లు వేయించానని కూడా లావు ఆ స్టేజ్ పై గొప్పలు చెప్పుకోవడం విశేషం. అంటే జగన్ హయాంలో జరిగిన మంచిని ఆయన పరోక్షంగా టీడీపీ సభలో వివరించినట్టయింది.
ఒకవేళ నిజంగానే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు నర్సరావుపేటకు అంత మంచి చేసి ఉంటే.. వైసీపీ హయాంలో సీఎం జగన్ సహకారంతోనే అదంతా సాధ్యమైందనే విషయాన్ని ఆయన ఒప్పుకుని తీరాల్సిందే. అంత అభివృద్ధికి కారకుడైన జగన్ ని కాదని, ఇప్పుడు చంద్రబాబు పార్టీకి ఓటు వేయాలని సదరు ఎంపీ అడగడమే ఆ సభలో హాస్యాస్పదం అనుకోవాలి. ఇక నర్సరావుపేటలో బీసీ అభ్యర్థికి చోటివ్వమంటే కాదు కూడదన్న ఎంపీ లావుకి గట్టి గుణపాఠం చెప్పడానికి బీసీ వర్గం అక్కడ రెడీగా ఉందని అంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి అనిల్ అక్కడ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నర్సరావుపేటలో ఈసారి సిట్టింగ్ ఎంపీకి ఓటమి ఖాయమని తేలిపోయింది.