పవన్ కల్యాణ్ నీడ నాదెండ్ల మనోహర్ ఏమయ్యాడు..?
జగన్‌ను గద్దె దించాలి కాబట్టి పవన్ కల్యాణ్ త్యాగాలకు సిద్ధపడ్డారని అనుకోవచ్చు. అలాంటప్పుడు తాను నష్టపోయానని, మధ్యవర్తిత్వం చేయడం తప్పు అని మాట్లాడడం రాజకీయ పరిణతి అనిపించుకోదు.
నోరు తెరిస్తే చాలు, వైఎస్ జగన్‌ను గద్దె దించుతానని, వైఎస్ జగన్‌ను తొక్కేస్తానని ప్రగల్భాలు పలికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెల్లని చీటీలా మారిపోతున్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఎత్తులకు చిత్తవుతూ వస్తున్నారు. బలమైన జనసేన నాయకులను కూడా డమ్మీలు చేస్తున్నారు. పోతిన మహేష్ వంటి నాయకులను కూడా దెబ్బ తీసే విధంగా ఆయన రాజకీయం నడుపుతున్నారు. జనసేనను నడిపించడంలోనే కాదు, రాజకీయాల్లో కొనసాగడంలోనూ ఆయన అపరిపక్వత, అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తన సోదరుడు నాగబాబుకు సీటు లేకుండా చేయడమే కాదు, తాను పోటీ చేసే స్థానాన్ని కూడా సరిగా ఎంపిక చేసుకోలేకపోయారు. చివరకు పిఠాపురం ఎంపిక చేసుకున్నారు. పిఠాపురంలో ఆయన టీడీపీ నేత నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు.
ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియని దుస్థితిలో ఆయన ఉన్నారు. బీజేపీని కూటమిలోకి తీసుకురావడం వల్ల తాను నష్టపోయానని ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. బీజేపీతో తనకు పొత్తు అవసరం లేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. నిజానికి, చంద్రబాబు కోరిక మేరకే బీజేపీని పవన్ కల్యాణ్ కూటమిలోకి తెచ్చారు. పవన్ కల్యాణ్ అంతా భుజాన వేసుకుని టీడీపీతో పొత్తుకు బీజేపీ పెద్దలను ఒప్పించారు. అటువంటి స్థితిలో పవన్ కల్యాణ్‌కు మరింత బలం చేకూరాలి. అందుకు విరుద్ధంగా బలం తగ్గుతూ పోయింది. తన పార్టీ టికెట్లను కూడా ఆయన కుదించుకుంటూ వచ్చారు. బీజేపీతో టీడీపీ పొత్తు కేవలం పవన్ కల్యాణ్ కోరుకోవడం వల్లనే ఏర్పడిందనే భావనకు చంద్రబాబు గురిచేశారు. నిజానికి, టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించినప్పటి నుంచి ఒక్క అడుగు కూడా ఆయన సవ్యంగా వేయలేదు.
సరే, జగన్‌ను గద్దె దించాలి కాబట్టి పవన్ కల్యాణ్ త్యాగాలకు సిద్ధపడ్డారని అనుకోవచ్చు. అలాంటప్పుడు తాను నష్టపోయానని, మధ్యవర్తిత్వం చేయడం తప్పు అని మాట్లాడడం రాజకీయ పరిణతి అనిపించుకోదు. దానివల్ల తనకే కాకుండా కూటమికి కూడా నష్టం జరుగుతుంది. హుందాగా వ్యవహరించాలి. కానీ ఆ హుందాతనం ఆయన రాజకీయాల్లో ఎక్కడా చూపించలేదు. గంభీరతను పాటించలేదు. దీనివల్ల ఎన్నికల్లో తనకే కాకుండా కూటమికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకుముందే ఆయన చేతులెత్తేసినట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడు తనను నీడలా అంటిపెట్టుకుని ఉన్న నాదెండ్ల మనోహర్ ఇప్పుడు తనకు కేటాయించిన తెనాలిలో గెలవడానికి కుస్తీ పడుతున్నారు. కీలకమైన సమయాల్లో కూడా పవన్ కల్యాణ్ వెంట ఉండడం లేదు. చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ ఐదుగురు జనసేన అభ్యర్థులను ప్రకటించే వరకు మాత్రమే మనోహర్ ఉన్నారు. ఈ ఐదుగురి జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. ఆ తర్వాత ఆయన పవన్ కల్యాణ్ వెంట కనిపించడం లేదు. పార్టీలో నెంబర్.2గా ఉంటూ వచ్చిన ఆయన తన వెంట నడవకపోవడాన్ని పవన్ కల్యాణ్ గుర్తించినట్లు కూడా లేరు. ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు.
టీడీపీ నుంచి వచ్చిన నాయకులకు ఆయన సీట్లు కేటాయించారు. నిజానికి, మిత్రపక్షాల మధ్య పార్టీ మార్పులను అనుమతించకూడదు. కానీ చంద్రబాబు వేసిన ఎత్తులో భాగంగా టీడీపీ నాయకులను పవన్ కల్యాణ్ జనసేనలో చేర్చుకుని వారికి టికెట్లు ఖరారు చేస్తున్నారు. మొదటి నుంచీ తనను నమ్ముకున్నవారిని విస్మరిస్తున్నారు. కందుల దుర్గేష్ వంటివారికి వారు కోరుకున్న సీటు కేటాయించలేకపోయారు.
జనసేనలో చేరడానికి ఆసక్తి చూపిన కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని వదులుకున్నారు. అలాగే, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను కూడా ఆయన ఖాతరు చేయలేదు. వీరిద్దరు ఆయనకు పెద్ద దిక్కుగా ఉండేవారు. చంద్రబాబు పన్నిన పన్నాగంలో పడి వారిద్దరనీ వదులుకున్నారు. హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్, ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిపోయారు. వారిద్దరి పట్ల వ్యవహరించిన తీరు పవన్ కల్యాణ్ అనుభవరాహిత్యాన్ని తెలియజేస్తోంది.
స్ట్రైక్ రేటు గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్‌కు దాన్ని సాధించడానికి జాగ్రత్తగా వ్యవహరించడం లేదు. జనసేనకు చెందిన బలమైన అభ్యర్థులకు వారికి తగిన సీట్లను కేటాయించాల్సి ఉంది. కానీ, అంతా తారుమారు అవుతుంటే స్ట్రైక్ రేటు అనేది డొల్లమాటనే అవుతుంది. జనసేనను ప్రారంభించి పదేళ్లవుతోంది. పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు. బలమైన నాయకులను నిలుపుకోలేని స్థితికి చేరుకున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్‌కు రాజకీయ పరిణతి లేదనే అర్థమవుతోంది.