ఏపీలో గ్రీష్మ తాపం.. - రెండు మూడు రోజుల పాటు తీవ్ర వడగాలులు

వడగాలుల ప్రభావం పెరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూర్మనాథ్‌ సూచించారు. వీలైనంతవరకు బయటికి వెళ్లే పనులను వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement
Update:2024-05-02 13:21 IST

ఏపీలో వేసవి ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఎండల తాకిడికి అల్లాడుతున్న ప్రజలకు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. మరో రెండు మూడు రోజుల పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని అధికారుల ప్రకటనతో జ‌నం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో దాదాపు 234 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం 31 మండలాల్లో తీవ్రస్థాయి వడగాలులు, 234 మండలాల్లో ఒక మోస్తరు వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

ప్రభావం ఉండే జిల్లాల వివరాలివీ..

శ్రీకాకుళం జిల్లాలో 5 మండలాల్లో, విజయనగరం 15, పార్వతీపురం మన్యం 8, ప్రకాశం 2, అల్లూరి సీతారామరాజు ఒక మండలంలో తీవ్ర వడగాలులు వీసే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అలాగే శ్రీకాకుళం 15, విజయనగరం 10, పార్వతీపురం మన్యం 7, అల్లూరి సీతారామరాజు 9, విశాఖపట్నం 1, అనకాపల్లి 15, కాకినాడ 13, కోనసీమ 9, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 1, ఏలూరు 18, కృష్ణా 11, ఎన్టీఆర్‌ 11, గుంటూరు 16, పల్నాడు 21, బాపట్ల 11, ప్రకాశం 18, తిరుపతి 12, నెల్లూరు 16, అనంతపురం 1, వైఎస్‌ఆర్‌ జిల్లాలో 5 మండలాల్లో ఒక మోస్తరు వడగాలులు వీయొచ్చని కూర్మనాథ్‌ తెలిపారు.

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి..

వడగాలుల ప్రభావం పెరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూర్మనాథ్‌ సూచించారు. వీలైనంతవరకు బయటికి వెళ్లే పనులను వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో తప్పని పరిస్థితి అయితే తప్ప బయటకు రావొద్దని, ఒకవేళ తప్పనిసరై బయటికి వెళ్లాల్సి వస్తే.. స్కార్ఫ్, కర్చీఫ్‌ వంటివి ధరించాలని తెలిపారు. ప్రతి 20 నిమిషాలకూ ఏదైనా ద్రావణాలు తీసుకోవాలని, అయితే కూల్‌డ్రింక్స్, కాఫీ, టీ, ఆల్కాహాల్‌ వంటివాటికి దూరంగా ఉండాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏమాత్రం అనుమానంగా ఉన్నా వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News