మోడీ, పవన్ మధ్య ఏం చర్చ జరిగిందో ఎప్పటికీ చెప్పం : నాదెండ్ల మనోహర్
ప్రధాని మోడీ, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన భేటీలో చర్చించిన అంశాలన్నీ రహస్యంగా ఉంటాయని నాదెండ్ల అన్నారు.
ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య భేటీ జరిగితే.. దాని సారాంశాన్ని వెంటనే మీడియాకు చెప్పడమో, పత్రికా ప్రకటన విడుదల చేయడమో ఆనవాయితీగా ఉంటుంది. భేటీలో జరిగిన విషయాలన్నీ ప్రస్తావించక పోయినా ఒకటో, రెండు పాయింట్లను వెల్లడిస్తుంటారు. ఇటీవల వైజాగ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఓ భేటీ జరిగింది. అయితే ఆ భేటీలో ఏం చర్చించారనే విషయాన్ని మాత్రం జనసేన వెల్లడించలేదు. కానీ, అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి జనసేనతో పొత్తు ఖరారయ్యిందంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాకు చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని, టీడీపీతో జత కట్టే అవకాశం లేదని పవన్ కల్యాణ్‌తో మోడీ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. వైసీపీపై పోరాడటమే జనసేనకు బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ అంటూ ఆ పార్టీ నేత బొలిశెట్టి సత్య కూడా వ్యాఖ్యానించారు. అయితే జనసేన మాత్రం అసలు ఈ భేటీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మోడీతో పవన్ ఏం చర్చించారనే విషయాన్ని పవన్ గానీ, నాదెండ్ల మనోహర్ కానీ ఎక్కడా ప్రస్తావించడం లేదు. పవన్ ఆశించిన రీతిలో ఆ భేటీ జరగలేదని, అందుకే మౌనంగా ఉండిపోయారనే వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా ఆ భేటీపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రధాని మోడీ, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన భేటీలో చర్చించిన అంశాలన్నీ రహస్యంగా ఉంటాయని అన్నారు. ఆ చర్చల సారాంశాన్ని ఎప్పటికీ, ఎవరికీ చెప్పేది లేదని స్పష్టం చేశారు. అక్కడ ఏ నిర్ణయం జరిగిందో జనసేన ఎప్పటికీ వెల్లడించబోదని తేల్చి చెప్పేశారు. మోడీ, పవన్ భేటీపై మీడియాలో వస్తున్న కథనాలన్నీ రూమర్సే అని నాదెండ్ల అన్నారు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి చర్చ ఉంటుంది. వాటి గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు.
గత వారం రోజులుగా మోడీ, పవన్ భేటీపై రకరకాల కథనాలు మీడియాలో వస్తున్నాయి. బీజేపీ-జనసేన పొత్తు ఉంటుందని, టీడీపీతో పొత్తుకు మోడీ విముఖత చూపారనేవి వాటి సారాంశం. ఏపీ బీజేపీ నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే బీజేపీ-జనసేన పొత్తు ఖరారయ్యిందనే రీతిలో మాట్లాడారు. కానీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ వారి వ్యాఖ్యలకు చెక్ పెట్టారు. బయట జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమే అనే విధంగా మనోహర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
ఇరువురి నాయకులు మధ్య జరిగిన చర్చలో అంత రహస్యం ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. రాజకీయ చర్చను బయటకు వెల్లడించబోమని అనడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కల్యాణ్ అక్కడకు టీడీపీ మధ్యవర్తిగా వెళ్లి ఉంటారని, దాన్ని మోడీ తీవ్రంగా వ్యతిరేకించి ఉంటారనే చర్చ మొదలైంది. నాదెండ్ల స్పందన చూస్తుంటే.. కచ్చితంగా చంద్రబాబు వ్యూహం మోడీ దగ్గర పారలేదనే అనుకుంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ నిరాశగా వెనుదిరిగినట్లు తెలుస్తున్నది. ఏదేమైనా మోడీతో ఏం జరిగింది అనేది పవన్ గానీ, నాదెండ్ల గానీ వెల్లడిస్తే తప్ప బయట ఎవరికీ తెలిసే అవకాశం లేదు.