భగ్గుమన్న మాచర్ల.. అసలేం జరిగింది..?

కొద్దిసేపటి తర్వాత వైసీపీ శ్రేణులు రోడ్ల మీదకు వచ్చాయి. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై ప్రతిదాడులకు దిగారు. టీడీపీ ఇన్‌చార్జ్ బ్రహ్మారెడ్డికి చెందిన నివాసానికి వెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు.

Advertisement
Update:2022-12-17 08:13 IST

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణం భగ్గుమంది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొన్ని గంటల పాటు దాడులు, ప్రతిదాడులతో అట్టుడికింది. టీడీపీ శ్రేణుల దాడులకు ప్రతిగా వైసీపీ శ్రేణులు టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో టీడీపీ మాచర్ల ఇన్‌చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి నివాసం తగలబడిపోయింది.

టీడీపీ ఇన్‌చార్జ్ బ్రహ్మారెడ్డి చేపట్టిన ''ఇదేం ఖర్మ రాష్ట్రానికి'' కార్యక్రమం ఈ పరిస్థితికి కారణమైంది. వైసీపీ కార్యకర్తలపై పెద్ద పెద్ద బండరాళ్లతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదేం ఖర్మ కార్యక్రమానికి బయలుదేరడానికి ముందే టీడీపీ కార్యకర్తలను భారీగా సమీకరించారు. వారందరినీ వెంటేసుకుని బ్రహ్మారెడ్డి కార్యక్రమానికి వెళ్లారు. గతంలో మాచర్ల వచ్చిన టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న కారుపై పెద్ద కర్రతో దాడి చేసిన మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ సొంత ప్రాంతమైన వడ్డెర కాలనీలోకి బ్రహ్మారెడ్డి వెళ్లారు.

అక్కడే టీడీపీ, వైసీపీ కార్యకర్తల చిన్నపాటి గొడవ జరిగింది. తమ ప్రాంతంలోకి బ్రహ్మారెడ్డి రావడానికి వీల్లేదంటూ వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైసీపీ కార్యకర్తలను దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. పలువురు వైసీపీ కార్యకర్తలు ప్రాణభయంతో పారిపోయారు. నడిరోడ్డుపై ఒక వైసీపీ కార్యకర్త మీదకు పెద్ద బండరాయితో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు అతి కష్టం మీద ఒప్పించి బ్రహ్మారెడ్డిని అక్కడి నుంచి పంపించారు. ఘర్షణలు జరిగే అవకాశం ఉందని నచ్చజెప్పి బ్రహ్మారెడ్డిని గుంటూరు పంపించారు.

కొద్దిసేపటి తర్వాత వైసీపీ శ్రేణులు రోడ్ల మీదకు వచ్చాయి. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై ప్రతిదాడులకు దిగారు. టీడీపీ ఇన్‌చార్జ్ బ్రహ్మారెడ్డికి చెందిన నివాసానికి వెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇంటితో పాటు పార్టీ కార్యాలయంగా వాడుతున్న భవనం పూర్తిగా కాలిపోయింది. గొడవల కారణంగా సకాలంలో ఫైర్ ఇంజిన్ కూడా రాలేకపోవడంతో నష్టం ఎక్కువగా జరిగింది. ఒక స్కార్పియో వాహనాన్ని కూడా కాల్చేశారు. మొత్తం 10 కార్లు ధ్వంసం అయ్యాయి. చివరకు అర్ధ‌రాత్రి సమయంలో భారీగా అదనపు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.

మాచర్లలో 144 సెక్షన్ విధించారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే కుట్రలో భాగంగానే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గొడవలు సృష్టిస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జ్ ఆరోపించారు. సున్నితమైన మాచర్ల ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలను రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే బ్రహ్మారెడ్డి రెచ్చిపోతున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోపించారు. బ్రహ్మారెడ్డి ఇంటికి ప్రణాళికలో భాగంగా టీడీపీ వారే నిప్పు పెట్టుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మాచర్లలో ఘర్షణల వెనుక రాజకీయ కారణాలు లేవని.. పాత ఫ్యాక్షన్ గొడవల కారణంగానే దాడులు జరిగాయని ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News