వివేకా రెండో భార్య మీడియా ముందుకొస్తున్నారా..?
వివేకా హత్య జరిగి, కేసు విచారణలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా బయటకు రాని షమీమ్.. ఇప్పుడు సడన్ గా తెరపైకి వస్తారా, లేక అజ్ఞాతంలోనే ఉంటారా.. అనేది తేలాల్సి ఉంది.
వైఎస్ వివేకా హత్యకేసు, సీబీఐ విచారణ ఏపీలో ప్రతి రోజూ హాట్ టాపిక్ గానే ఉంటోంది. ఈనెల 25 వరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉండదు అనుకుంటే, మధ్యలో సునీత సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇటు సీబీఐ, అవినాష్ రెడ్డిని ప్రతి రోజూ విచారణకు పిలుస్తోంది. అయితే ఇక్కడే మరో పుకారు షికారు చేస్తోంది. వివేకా రెండో భార్య షమీమ్ తెరపైకి వస్తారని, ఆల్రడీ ఆమె స్టేట్ మెంట్ ఇచ్చేశారని చెబుతున్నారు. కేవలం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే విషయాలను హైలెట్ చేస్తోంది. వివేకా రెండో భార్య షేక్ షమీమ్ స్టేట్ మెంట్ ని ప్రచారంలోకి తెచ్చింది.
వివేకాతో తనకు 2010 లో వివాహం అయ్యిందని.. 2011లో మరోసారి వివాహం జరిగిందని షేక్ షమీమ్ స్టేట్ మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2015లో వారికి షెహన్షా అనే బిడ్డ పుట్టారట. హత్యకు కొన్ని గంటల ముందు కూడా వివేకా తనతో మాట్లాడినట్టు షమీమ్ చెప్పారని అంటున్నారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, ముఖ్యంగా.. వివేకా బామ్మర్ది, అల్లుడికి అన్న అయిన నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి తమను ఎన్నోసార్లు బెదిరించారని ఆమె చెబుతున్నట్టు వార్తలొస్తున్నాయి. వివేకా హత్య జరిగిన తర్వాత తాను బయటకు వద్దామనుకున్నా, వారి కుటుంబ సభ్యులకు భయపడి రాలేకపోయానని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చినట్టు చెబుతున్నారు.
అంతా చెక్ పవర్ వల్లే..
వివేకా చెక్ పవర్ తొలగించారని, షెహన్షా పేరిట ఆయన 4 ఎకరాల పొలం కొనాలనుకున్నా, దానికి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారనే ప్రచారం కూడా జరుగుతోంది. అన్నిటికీ మించి షమీమ్ కోర్టు మెట్లెక్కబోతున్నారనే వార్తలు కూడా బలంగా వినపడుతున్నాయి.
వివేకా హత్య తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసేవారంతా నేరుగా మీడియా ముందుకు వస్తున్నారు. బెయిల్ పై ఉన్న దస్తగిరి కూడా మీడియాతో దర్జాగా మాట్లాడుతున్నారు. వివేకా రెండో వివాహం గురించి అవినాష్ రెడ్డి నేరుగా మీడియా ముందే కుండబద్దలు కొట్టారు. కానీ ఇప్పుడు వివేకా రెండో భార్య మాత్రం ఇంకా మీడియా ముందుకు రాలేదు. ఆమే స్టేట్ మెంట్ ఇచ్చారు అనే వార్తలకు ధృవీకరణ లేదు. ఆమే నేరుగా ప్రెస్ మీట్ పెడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. వివేకా హత్య జరిగి, కేసు విచారణలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా బయటకు రాని షమీమ్.. ఇప్పుడు సడన్ గా తెరపైకి వస్తారా, లేక అజ్ఞాతంలోనే ఉంటారా.. అనేది తేలాల్సి ఉంది.