బలవంతపు రాజీనామాలు..! వాలంటీర్లు ఎందుకిలా రివర్స్ అయ్యారు..?

కూటమి ప్రభుత్వం వాలంటీర్ల పట్ల సానుకూల దృక్పథంతో ఉంటుందా..? లేదా వారిపై వైసీపీ ముద్రవేసి, కొత్తవారిని నియమించుకుంటుందా..? వేచి చూడాలి.

Advertisement
Update:2024-06-19 09:35 IST

నిన్న మొన్నటి వరకు వాలంటీర్లు తమకు అండగా ఉంటారని, వాలంటీర్లే ప్రజలకు ప్రభుత్వానికి వారధి అని వైసీపీ భావించింది. వాలంటీర్లంతా వైసీపీ ఏజెంట్లేనని టీడీపీ కూడా విమర్శించింది. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఏ జగన్ గెలుపుకోసం స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారో.. అదే జగన్ ఓడిపోయే సరికి వాలంటీర్లంతా రివర్స్ అయ్యారు. రాజీనామాలన్నీ బలవంతంగా చేసినవేనంటున్నారు. నెల్లూరు లాంటి ప్రాంతాల్లో వైసీపీ నేతలపై వాలంటీర్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తమచేత బలవంతంగా రాజీనామాలు చేయించారని, తమ జీవితాలు రోడ్డునపడేశారని ఆరోపించారు.

మేం ముందే చెప్పాం కదా..!

జులై-1న పెన్షన్ల పంపిణీ సమయానికి వాలంటీర్ల వ్యవహారం ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ తిరిగి మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఒకేసారి రూ.7వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి.. ఓ భారీ కార్యక్రమంలా పెన్షన్లు పంపిణీ చేయాలనుకుంటున్నారు కూటమి నేతలు. దీంతో వాలంటీర్లకు మళ్లీ పనిపడింది. రాజీనామాలు చేయనివారు ఓకే, మరి చేసిన వారి పరిస్థితి ఏంటి..? వారంతా ఇప్పుడు తమని కూడా విధుల్లోకి తీసుకోవాలంటూ టీడీపీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేం ముందే చెప్పాం కదా, మీరెందుకు రాజీనామాలు చేశారంటూ టీడీపీ నేతలు వారిని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

వాలంటీర్లు ఎటువైపు..?

వాలంటీర్లే కాదు, ఓటర్లు కూడా ఏవైపు ఉంటారో అర్థం కాని పరిస్థితి. అధికారంలో ఎవరుంటే వారివైపు అందరూ.. అనుకోవాల్సిన సందర్భం. నిన్న మొన్నటి వరకు జై జగన్ అన్న వాలంటీర్లు, ఇప్పుడు జై చంద్రబాబు అనేందుకు వెనకాడ్డంలేదు. జగన్ గెలుపుకోసం రాజీనామాలు చేశామన్నవారే, వైసీపీ వాళ్లు మమ్మల్ని బలవంతపెట్టారంటూ మాట మార్చేశారు. రూ.5వేల జీతానికి పనిచేసే వాలంటీర్లను ఇక్కడ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఉపాధికోసం వారు పనిచేశారు, ఇప్పుడు ఉపాధి పోతుందనే బాధలో మాట్లాడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం వీరిపట్ల సానుకూల దృక్పథంతో ఉంటుందా..? లేదా వారిపై వైసీపీ ముద్రవేసి, కొత్తవారిని నియమించుకుంటుందా..? వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News