వాలంటీర్ల ఆశలపై జగన్ నీళ్లు చల్లినట్టేనా..?
ఇక వాలంటీర్లపై నాయకులు ఆధారపడాల్సిన అవసరం లేదు, దానికోసం ప్రత్యామ్నాయ వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. ఇప్పుడు నియమిస్తున్నవారంతా పార్టీ కార్యకర్తలే కాబట్టి, పారితోషికం ఇవ్వాల్సిన పనిలేదు.
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు.. సీఎం జగన్ పై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ప్రస్తుతానికి నెలకు 5వేల రూపాయలు గౌరవ పారితోషికం ఇస్తున్నా, భవిష్యత్తులో తమని కూడా ఉద్యోగులుగా గుర్తించకపోతారా, ఎప్పటికైనా పర్మినెంట్ చేయకపోతారా అనే ఆశతో ఉన్నారు. కానీ ఆ ఆశలపై జగన్ ఒక్కసారిగా నీళ్లు చల్లారు. వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా వైసీపీ కోసం సమన్వయకర్తలు, గృహ సారథులు రాబోతున్నారు. ఇలా కొత్తగా వచ్చేవారంతా పూర్తిగా పార్టీకోసం పనిచేస్తారు. అంటే ఇకపై వాలంటీర్లకు స్థానిక రాజకీయ నాయకులు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు.
ఎన్నికల్లో హవా..
స్థానిక ఎన్నికలు, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వాలంటీర్ల హవా నడిచింది. వాలంటీర్లు పార్టీకోసం కష్టపడ్డారు, దానికి తగిన ప్రైవేట్ పారితోషికాలు కూడా బాగానే ముట్టాయనే ప్రచారం ఉంది. తమ పరిధిలోని 50ఇళ్ల సమాచారం, ఎవరెవరు ఎటువైపు ఉంటారు, ఓటుకు నోటు ఇస్తే ఎవరు ఇటువైపు వస్తారు, వారికి ఎలా చేరవేయాలి అనే విషయాలన్నీ వాలంటీర్లకు కొట్టినపిండి. ప్రభుత్వం తరపున పారితోషికం ఇస్తున్నా, ప్రభుత్వ పనులతోపాటు, పార్టీ పనులకు కూడా వారిని బాగానే వాడుకుంటున్నారు ఎమ్మెల్యేలు. 50 ఇళ్లకు చెందిన సమస్త సమాచారం అంతా వాలంటీర్ ఫోన్ లో నిక్షిప్తం అయి ఉంటుంది కాబట్టి వారే అన్నీ అయ్యారు. అయితే ఇప్పుడు వాలంటీర్లపై నాయకులు ఆధారపడాల్సిన అవసరం లేదు, దానికోసం ప్రత్యామ్నాయ వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. ఇప్పుడు నియమిస్తున్నవారంతా పార్టీ కార్యకర్తలే కాబట్టి, పారితోషికం ఇవ్వాల్సిన పనిలేదు. ఇతర పార్టీల్లో సభ్యులకు ఇస్తున్నట్టుగా సామూహిక బీమా వర్తింపజేస్తారు. పక్కాగా పార్టీ పనులకోసం వీరిని ఉపయోగించుకుంటారు.
వాలంటీర్ జీతం 5వేలు మాత్రమే. కానీ ఏపీలో డిగ్రీ, బీటెక్, పీజీ చదివినవారు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్న ఉదాహరణలున్నాయి. ఎప్పటికైనా తమకు కూడా మంచిరోజులొస్తాయేమోనని వారు ఎదురు చూస్తున్నారు. కానీ కొత్తగా పార్టీకోసం మరికొన్ని పోస్ట్ లు సృష్టించడంతో ఇక వాలంటీర్ల సేవలు పార్టీకి పెద్దగా అవసరం లేదని అంటున్నారు. అంటే వాలంటీర్ పూర్తిగా సచివాలయ బాధ్యతలకు, లేదా పింఛన్ల పంపిణీకి, ఇతర డేటా సేకరణకు అవసరం. అంతకు మించి వారికి అదనంగా బాధ్యతలు ఉండవు, అదే సమయంలో పారితోషికం పెంచరనే విషయం కూడా తేలిపోయింది.