విజయవాడ నుంచి నాలుగ్గంటల్లో షార్జా

రాష్ట్రం నుంచి గల్ఫ్‌ దేశాలకు రాకపోకలు సాగించేవారికి శుభవార్త. ఇక విజయవాడ నుంచి నాలుగ్గంటల్లో షార్జా వెళ్లవచ్చు.

Advertisement
Update:2022-08-28 21:27 IST

రాష్ట్రం నుంచి గల్ఫ్‌ దేశాలకు రాకపోకలు సాగించేవారికి శుభవార్త. ఇక విజయవాడ నుంచి నాలుగ్గంటల్లో షార్జా వెళ్లవచ్చు. అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల అవసరమైన చోటుకు సులభంగా చేరుకోవచ్చు. విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జాకు విమానం నడిపేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముందుకొచ్చింది. అంతేకాదు టికెట్ల అమ్మకం కూడా మొదలుపెట్టింది. అక్టోబరు 31 నుంచి ప్రతి సోమ, శనివారాల్లో.. వారానికి రెండురోజులు ఈ విమానం నడవనుంది. దాదాపు మూడేళ్ల తరువాత విజయవాడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడవనున్నాయి. కోవిడ్‌ మొదలైన తరువాత దేశం నుంచి విదేశీ విమాన సర్వీసులన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం విదేశాల నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన వందేభారత్‌ మిషన్‌లో భాగంగానే కొన్ని సర్వీసులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధాన్ని ఎత్తేయడంతో ఇప్పుడు ఈ ప్రయాణాలు మొదలుకానున్నాయి.

విజయవాడ-షార్జా ప్రారంభ టికెట్‌ ధర రూ.15,069

విజయవాడ నుంచి వారానికి రెండురోజులు నడిపే విమానంలో షార్జాకు ప్రారంభ టికెట్‌ ధర రూ.15,069గా నిర్ణయించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ టికెట్ల అమ్మకాలు కూడా మొదలుపెట్టింది. మన దేశం సమయం ప్రకారం షార్జాలో మధ్యాహ్నం 1.40 గంటలకు బయలుదేరే విమానం సాయంత్రం 5.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తుంది. గంట తరువాత సాయంత్రం 6.35 గంటలకు ఇక్కడ బయలుదేరి రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుకుంటుంది. ఈ సంస్థ నడపనున్న బోయింగ్‌ 737-800 విమానంలో 186 మంది ప్రయాణికులు వెళ్లవచ్చు.

అరబ్‌ దేశాలకు ప్రయాణం ఈజీ

రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి వేలాదిమంది ఉద్యోగాలు, ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాల్లో ఉంటున్నారు. వారు రాకపోకలు సాగించాలంటే ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇకమీదట ఆ ఇబ్బందులు తొలగిపోయినట్లే. తాజా విమాన సర్వీస్‌ వల్ల యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని షార్జాతో పాటు దుబాయ్, అబుదాబి, అజ్మన్, పుజిరా, రస్‌ ఆల్‌ ఖైమాలకు విజయవాడ నుంచి సులభంగా వెళ్లిరావచ్చు. గల్ఫ్‌లోని వివిధ దేశాలకు షార్జా నుంచి సులభంగా వెళ్లవచ్చు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని విమానయాన సంస్థలు ఆయా దేశాలకు విమనాలు నడిపే అవకాశం ఉంది.

గతంలో..

2019లో ఆరునెలల పాటు విజయవాడ-సింగపూర్‌ మధ్య నడిచిన వారానికి ఒక సర్వీస్‌ను సాంకేతిక కారణాలతో నిలిపేశారు. దుబాయ్, సింగపూర్‌లకు అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు నడిపేందుకు జరిగిన ప్రయత్నాలు కోవిడ్‌ కారణంగా ఆగిపోయాయి. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా మాత్రమే ఇక్కడి నుంచి ఒమన్‌ రాజధాని మస్కట్‌కు వారానికి ఒక సర్వీస్, షార్జా, కువైట్, మస్కట్‌ల నుంచి వారానికి ఐదు సర్వీస్‌లు ఇక్కడికి నడుస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News