వారికి టికెట్ ఇస్తే చచ్చినా మద్దతు ఇవ్వను -కేశినేని నాని
తనకంటూ ఒక క్యారెక్టర్ ఉందని ఎవరినీ మోసం చేసేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన సమయం వచ్చిందన్నారు. క్యారెక్టర్ ఉన్నవాడిని ప్రజలు ఎంపీ కాకపోతే ఏ స్థాయికి అయినా తీసుకెళ్తారని నాని అభిప్రాయపడ్డారు.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పక్కనపెట్టి మరొకరికి టికెట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పార్టీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారికి టికెట్ ఇస్తే తాను కచ్చితంగా మద్దతు ఇవ్వబోనని ప్రకటించారు. తన తమ్ముడికి విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తే చచ్చినా తాను మద్దతు ఇవ్వబోనని, తన తమ్ముడు అంత యాక్టివ్ గా ఉంటే అతని వెంటే తిరగాలని, తన వెంట ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు.
తనకంటూ ఒక క్యారెక్టర్ ఉందని ఎవరినీ మోసం చేసేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన సమయం వచ్చిందన్నారు. క్యారెక్టర్ ఉన్నవాడిని ప్రజలు ఎంపీ కాకపోతే ఏ స్థాయికి అయినా తీసుకెళ్తారని నాని అభిప్రాయపడ్డారు.
కబ్జాకోర్లు, రియల్ ఎస్టేట్ మోసాలు చేసిన వారు, పేకాట క్లబ్‌లు నడిపే వారికి, కాల్ మనీ సెక్స్ రాకెట్లను నడిపే వారికి టికెట్లు ఇచ్చి మద్దతు ఇవ్వాలంటే తాను ఇవ్వబోనని చెప్పారు. పార్టీలో దావూద్ ఇబ్రహీంలు ఉండవచ్చు, కాల్ మనీ సెక్స్ రాకెట్లు చేసే వాళ్ళు ఉండవచ్చు, చార్లెస్ శోభరాజ్ లు ఉండవచ్చని, కానీ అలాంటి వారికి టికెట్ ఇస్తే మాత్రం తాను పనిచేయనని తెగేసి చెప్పారు.
నందిగామ వచ్చిన కేశినేని నానిని మీడియా ప్రతినిధులు పార్టీలో మీ తమ్ముడు ఇటీవల యాక్టివ్ గా ఉంటున్నారు, టికెట్ ఆయనకే ఇస్తారట కదా అని ప్రశ్నించగా.. ఇస్తే మంచిదే కదా అంటూ వ్యంగంగా మాట్లాడారు. ఒకవేళ తన తమ్ముడికి టికెట్ ఇస్తే మాత్రం తాను చచ్చినా మద్దతు ఇవ్వనని చెప్పారు.