టీడీపీకి వచ్చేవి 4 సీట్లే.. లాజిక్ చెప్పిన విజయసాయి
విజయసాయిరెడ్డి చెప్పిన లాజిక్ ప్రకారం ఈసారి టీడీపీ కేవలం 4 స్థానాలకే పరిమితమవుతుందని వైసీపీ నేతలు కూడా అంటున్నారు.
ఈసారి టీడీపీకి కేవలం 4 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ఆ 4 సీట్లకు సంబంధించి విజయసాయి ఓ లాజిక్ కూడా చెప్పారు. ఆ లాజిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగానే టీడీపీకి 4 సీట్లు వస్తాయేమోనంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
"చంద్రబాబూ...!
పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే.
ఈసారి మా వాళ్ళను నలుగురిని ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నది.
ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ?
ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి...నీ మీద జాలేస్తోంది!" అంటూ ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి.
విజయసాయిరెడ్డి చెప్పిన లాజిక్ ప్రకారం ఈసారి టీడీపీ కేవలం 4 స్థానాలకే పరిమితమవుతుందని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. అంతకంటే ఎక్కువ సీట్లు రావని, కూటమి కట్టినా, జెండాలు జతకట్టినా వైసీపీదే విజయం అంటున్నారు. ఈసారి ఏపీ ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాయంటూ లండన్ వెళ్లే ముందు సీఎం జగన్ చెప్పిన మాటల్ని కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
రివర్స్ లాజిక్..
మరికొందరు నెటిజన్లు అదే లాజిక్ వైసీపీకి కూడా అప్లై అవుతుందని గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్.. ని వైసీపీ లాగేసుకుందని, అంటే.. వైసీపీకి కూడా నాలుగు సీట్లే వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. జనసేన ఎమ్మెల్యే రాపాకని కూడా కలుపుకొన్నారు కాబట్టి ఆ సీట్లు 5 దగ్గర ఆగుతాయా అని అడుగుతున్నారు.