మావోయిస్టుల లేఖలో విజయసాయిరెడ్డి పేరు
పరిపాలన రాజధాని పేరుతో ముఖ్యమంత్రి, ఆయన సన్నిహితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు విశాఖను దోచేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
ఏపీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ ఏఓబీ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ ఒక లేఖను విడుదల చేశారు. పరిపాలన రాజధాని పేరుతో ముఖ్యమంత్రి, ఆయన సన్నిహితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు విశాఖను దోచేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలోని ప్రజలు పోరాడి సాధించుకున్న 30 ఎకరాల పొలంతో పాటు.. చుట్టుప్రక్కల భూములను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అప్పలరాజు, వైసీపీ నేత దువ్వాడ శ్రీధర్‌లు కలిసి ఆక్రమించి ఒక కార్పొరేట్ సంస్థకు ఆ భూములను వేల కోట్లకు ధారదత్తం చేశారని గణేష్ ఆరోపించారు.
విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ భూములనూ ఈ నేతలు దోచేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. మన్యంలో లేటరైట్ పేరుతో వేలాది ఎకరాల్లో అడవులను ధ్వంసం చేసి నాలుగు లైన్ల రోడ్లను కూడా వేసి ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారని.. ఈ పనులకు మూల్యం చెల్లించుకుంటారని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది.
వైసీపీ నేతల భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటాలకు మావోయిస్టు పార్టీ అండగా, మద్దతుగా ఉంటుందని గణేష్ చెప్పారు.