పురంధేశ్వరి అసలు ప్లాన్ ఇదే..! గుట్టు విప్పిన విజయసాయి
స్వార్థం, కపటం పురంధేశ్వరి సహజ ఆభరణాలు. టీడీపీతో పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారు. బంధుత్వం మాటున ఆమె రహస్య ఎజెండా ఏమిటంటే..? అంటూ ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి.
పురంధేశ్వరి ఇటీవల పదే పదే చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడుతున్నారు. చెల్లెలి భర్తగా చంద్రబాబుపై ఆమె అభిమానం చూపిస్తున్నారనుకోలేం. ఆ మాటకొస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్యగా చంద్రబాబుతో కుటుంబ, రాజకీయ వైరుధ్యం అత్యథికంగా ఉన్నది పురంధేశ్వరికే. కానీ ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా మారిన తర్వాత వ్యవహారంలో చాలా మార్పు వచ్చింది. టీడీపీ నేతలకంటే ఎక్కువగా చంద్రబాబుకి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు పురంధేశ్వరి. నారా లోకేష్ - అమిత్ షా భేటీకి కూడా ఆమె సాయమందించారు. ఎందుకిలా..? అసలు ఆమె అజెండా ఏంటి..? ఆ విషయాన్ని సూటిగా ప్రస్తావించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
"స్వార్థం, కపటం పురంధేశ్వరి సహజ ఆభరణాలు. టీడీపీతో పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారు. బంధుత్వం మాటున ఆమె రహస్య ఎజెండా ఏమిటంటే బావ చంద్రబాబు సహాయంతో ఎంపీగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారు. అందుకే ఆయనపై ఈగ కూడా వాలకుండా విసనకర్ర ఊపుతున్నారు." అంటూ ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి.
సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయాలనేది పురంధేశ్వరి ఆలోచన. ఒంటరిగా బీజేపీ బరిలో దిగితే ఆమె గెలవడం అసాధ్యం. టీడీపీ, జనసేనతో పొత్తులో ఉన్నా టికెట్ ఖరారు చేయాల్సింది మాత్రం చంద్రబాబే. ఒకవేళ పొత్తులో లేకపోయినా పురంధేశ్వరి పోటీ చేసే చోట బలహీన అభ్యర్థిని బరిలో దింపడం కూడా చంద్రబాబు చేతిలోని పనే. అంటే ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే పురంధేశ్వరికి లైన్ క్లియర్ అవుతుంది. ఆమె ఎంపీగా గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇప్పటినుంచే ఆయన్ను కాకా పడుతోందని విజయసాయి వివరించారు.
చిన్నమ్మా, పున్నమ్మా..
ఇటీవల పురంధేశ్వరి, విజయసాయిరెడ్డి మధ్య మాటల తూటాలు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. విజయసాయిపై ఉన్న పాత కేసుల్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పురంధేశ్వరి లేఖ రాయడంతో ఈ గొడవ మరింత ముదిరింది. పురంధేశ్వరిపై వరుస ట్వీట్లు వేస్తున్నారు విజయసాయిరెడ్డి. చిన్నమ్మా, పున్నమ్మా అంటూ ఆమెపై విమర్శలు ఎక్కుపెట్టారు.