వరుస నియామకాలు.. విజయబాబుకు కీలక పదవి
ఇటీవల వరుసగా నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నటుడు అలీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాస్ పేరును దాదాపు ఖరారు చేశారు.
ఏపీ ప్రభుత్వంలో నియామకాల జోరు మళ్లీ పెరిగింది. ఆర్టీఐ మాజీ కమిషనర్ పి. విజయబాబును ఏపీ అధికార భాష సంఘం అధ్యక్షుడిగా ప్రభుత్వం నియమించింది. ఈ పదవిలో విజయబాబు రెండేళ్లు ఉంటారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయబాబు టీడీపీ, జనసేన విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తుంటారు.
గతంలో ఆర్టీఐ కమిషనర్‌గా ఉన్నప్పుడు విజయబాబుకు సరైన ఆఫీస్, సిబ్బందిని కూడా కేటాయించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. కాపు సామాజికవర్గానికి చెందిన విజయబాబు ఒక దశలో జనసేనలో చేరినా అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు. మొన్నటి వరకు ఏపీ అధికార భాష సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉండేవారు. హెల్త్ యూనివర్శిటికీ ఎన్టీఆర్ పేరు తొలగింపును నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. యార్లగడ్డ రాజీనామా చేయకపోయి ఉంటే ఆయన 2023 ఆగస్ట్ వరకు ఆ పదవిలో ఉండేవారు.
ఇటీవల వరుసగా నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నటుడు అలీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాస్ పేరును దాదాపు ఖరారు చేశారు. ప్రస్తుత చైర్మన్ పదవీకాలం ముగియగానే కొమ్మినేని ఆ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఎన్నికలకు ఏడాదిన్నరకు పైగా మాత్రమే సమయం ఉండడంతో తమకు సహకరించిన వారికి పదవులు అప్పగించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.