ఢిల్లీ ధర్నా.. జగన్ కు ఎవరెవరు మద్దతిచ్చారంటే..?
వైసీపీకి మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు జగన్. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైసీపీ ధర్నా ముగిసింది. జాతీయ స్థాయిలో ఏపీ శాంతి భద్రతల అంశాన్ని హైలైట్ అయ్యేలా వైసీపీ నేతలు చేసిన ప్రయత్నం దాదాపు ఫలించినట్టే చెప్పాలి. ఈ ధర్నాకు అన్నా డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్ వర్గం), ఏఐఎంఎల్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆమ్ ఆద్మీ పార్టీ, వీసీకే పార్టీల నేతలు మద్దతు తెలపడం విశేషం. ధర్నా మొదలవగానే సమాజ్ వాదీ పార్టీ తరపున అఖిలేష్ యాదవ్ జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు ఏపీ తాజా పరిస్థితిని జగన్ వివరించారు. ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా తయారయ్యాయని ఫొటోలు, వీడియోలు చూపించారు.
అఖిలేష్ యాదవ్ సహా ఇతర నేతలు జగన్ కు సంఘీభావం తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దుర్మార్గ పరిస్థితులు ఉండకూడదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున వైసీపీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు మాజీ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్. తృణమూల్ కాంగ్రెస్ తరపున వైసీపీకి మద్దతు తెలిపేందుకు వచ్చారు ఎంపీ నదీమ్ ఉల్ హక్. వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నట్టు చెప్పారాయన.
అన్నా డీఎంకే ఎంపీ తంబి దురై, ఉద్దవ్ శివసేన తరపున ధర్నా శిబిరానిక వచ్చిన ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది కూడా ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా తమకు ఆ దారుణాలు అర్థమయ్యాయని అన్నారు. ఇండియా కూటమి తరపున తాము వైసీపీకి అండగా ఉంటామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగకూడదన్నారు ఎంపీలు. వెంటనే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. వైసీపీకి మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు జగన్. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.