రాక్షస పాలన అంతం.. వారాహి లక్ష్యం..

తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు నుంచి ఏపీలో రాక్షస పాలన అంతం చేయడమే ‘వారాహి’ లక్ష్యమని చెప్పారు పవన్‌ కల్యాణ్.

Advertisement
Update:2023-01-25 11:57 IST

వారాహి వాహనానికి బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకున్నారు పవన్ కల్యాణ్. విజయవాడలో ఆయనకు అభిమానులు, జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న పవన్, ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం తన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’కి దుర్గమ్మ చెంత పూజలు నిర్వహించారు. మంగళవారం తెలంగాణలోని కొండగట్టు, ధర్మపురి ఆలయాల వద్ద ‘వారాహి’కి ప్రత్యేక పూజలు చేయించిన పవన్‌, ఈరోజు ఇంద్రకీలాద్రిపై వారాహికి వాహన పూజ చేశారు. నాదెండ్ల మనోహర్ సహా ఇతర కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలో పసుపు నీళ్లను బిందెలతో తెచ్చి వారాహి వాహనం ముందు ఉంచి పూజలు చేశారు.


దుర్గమ్మ పిలిపించుకున్నారు.

కొండగట్టు, ధర్మపురి క్షేత్రాల సందర్శన అనంతరం అమ్మవారి ఆశీస్సులు తాను కోరుకున్నానని, ఆమె తనను పిలిపించుకున్నారని భావిస్తున్నట్టు తెలిపారు పవన్. తనకు దుర్గమ్మ ఆశీర్వాదాలు కూడా లభించాయన్నారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు నుంచి ఏపీలో రాక్షస పాలనను అంతం చేయడమే ‘వారాహి’ లక్ష్యమని చెప్పారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో పవన్‌ కల్యాణ్ సమావేశం కావాల్సి ఉంది.

విజయవాడలో పవన్ రోడ్ షో కి అభిమానులు తరలి వచ్చారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. గజమాలతో ఆయన్ను సత్కరించారు. ఆయనకు ఓ గద బహూకరించారు. వారాహిపై నిలబడి అభివాదం చేస్తూ పవన్ ముందుకు కదిలారు. ఏపీలో వారాహికి ఎంట్రీ లేదని ఆమధ్య వైసీపీ నేతలు ఘాటుగా హెచ్చరించారు. పవన్ పర్యటన నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయనే అనుమానాలున్నా పర్యటన సజావుగానే మొదలైంది. 

Tags:    
Advertisement

Similar News